
ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
పర్లాకిమిడి: అఖిల భారత స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నిర్మలా శెఠి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు మాట్లాడుతూ, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఒడిషాలో అతి పురాతన, రెండో అతిపెద్ద పురపాలక సంఘం పర్లాకిమిడి అని అన్నారు. పురపాలక సంఘం పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ఇంకా అనేక పథకాలకు నిధులు ఖర్చుపెట్టి సర్వాంగ సుందరంగా తీర్చుదిద్దుతామని అన్నారు. అనంతరం పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న అత్యుత్తమ సేవలు అందించిన సిబ్బందికి అవార్డులను చైర్మన్ నిర్మల అందజేశారు. ఉత్తమ ఇళ్ల పన్నులు వసూలు చేసిన అలియా శోబోరో, మనోజ్ శతపతికి అవార్డులను చైర్మన్ నిర్మలా అందజేశారు. అంతకు ముందు కొత్త బస్టాండు వద్ద అంబేడ్కర్ విగ్రహానికి వార్డు నంబర్ 1 కౌన్సిలరు అలిజింగి అమ్ములమ్మ పూలమాలలు వేసి వందనం సమర్పించారు. అలాగే పురపాలక సంఘం కార్యాలయం, పాత బస్టాండు పార్కు వద్ద మహారాజా కృష్ణచంద్ర గజపతికి విగ్రహానికి పూలమాలలు సమర్పించి వందనాలు సమర్పించారు, కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షులు లెంక మధు, కౌన్సిలర్లు బాలకృష్ణ పాత్రో, బబునా బెహారా, త్రిపాఠి, అమ్ములమ్మ పురపాలక ఈఓ, లక్ష్మణ ముర్ము తదితరులు పాల్గొన్నారు.
రాయగడలో..
రాయగడ: పట్టణ ప్రజలకు మౌలిక సౌకర్యాలు క ల్పించడంతో పాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అశుతొష్ కులకర్ణి అన్నారు. స్థానిక మున్సిపాలిటీ ఆడిటోరియంలొ ఆదివారం నాడు మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వపరిపాలన దినొత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కలెక్టర్ రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా అన్ని రంగాల్లో ముందడుగు వేసేలా అధికారులు, పాలకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటిని సకాలంలో పరిష్కరించేందుకు పాటుపడాలని అన్నారు. రహదారుల నిర్మాణం, పరిశుభ్రత పాటించడంపై యంత్రాంగం శ్రద్ధ వహించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల మధ్య నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ, మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ కుమార్ పట్నాయక్, వైస్ చైర్మన్ శుభ్రా పండ, కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గుణుపూర్‌లో..
స్వపరిపాలన దినొత్సవాన్ని పురష్కరించుకుని జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీ యంత్రాంగం నిర్వహించిన సమావేశంలో గుణుపూర్ బీడీఓ స్వస్థిక్ జమాదర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సిపాలిటీ చైర్మన్ మమత గౌడొ, వైస్ చైర్మన్ శివ కుమార్ గౌడొ, కార్యనిర్వాహక అధికారి సంతొష్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గౌడొ మాట్లాడుతూ అందరి సహకారంతొ గుణుపూర్‌ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షించారు.

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం