
బారంగ్‌లో తొలి అంధుల విశ్వవిద్యాలయం
● 30 ఎకరాల స్థలం గుర్తింపు
భువనేశ్వర్:
దృష్టి లోపం ఉన్న వారి కోసం దేశంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం బారంగ్ గంగేశ్వర్ మౌజాలో నిర్మిస్తున్నారు. దీని కోసం భూమి గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. దివ్యాంగుల సామాజిక భద్రత, సాధికారత (ఎస్‌ఎస్‌ఈపీడీ) తుది ఆమోదం కోసం వేచి ఉంది. గంగేశ్వర్ మౌజాలో ఈ విశ్వవిద్యాలయం కోసం 29.75 ఎకరాల భూమిని గుర్తించారు. కటక్ నగరంలో విశ్వవిద్యాలయాన్ని నిర్మించడానికి అనుకూలమైన స్థలం లభ్యం కాకపోవడంతో జంట నగరాల మధ్య బారంగ్ ప్రాంతంలో సుమారు 40 ఎకరాల స్థల సేకరణకు ఎంపిక చేశారు. తదుపరి దశలో విశ్వవిద్యాలయం కోసం సుమారు 30 ఎకరాల భూమిని ఖరారు చేశారు. ఈ భూమిని ఎస్‌ఎస్‌ఈపీడీ పేరుకు బదలాయించేందుకు ఇప్పుడు ప్రక్రియ ప్రారంభమైంది. దీని కోసం, జిల్లా సామాజిక భద్రతా అధికారికి సమన్వయ బాధ్యత అప్పగించారు. భూ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసే బాధ్యతను ఆ శాఖకు అప్పగించారు. ప్రతిపాదిత తొలి అంధుల విశ్వ విద్యాలయానికి భీమ భొయ్ సెంట్రల్ యూనివర్సిటీ ఫర్ ది బ్లైండ్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయడం గమనార్హం. గతంలో, స్థలం ఎంపిక సమయంలో కేంద్ర ప్రతినిధి బృందం కటక్, భువనేశ్వర్‌లోని వివిధ ప్రదేశాలను సందర్శించింది. అయితే, ఈ విద్యా సంస్థ యొక్క జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా కటక్, భువనేశ్వర్ మధ్య ప్రాంతాన్ని ఎంపిక చేశారు. మరోవైపు, ప్రస్తుతం రాష్ట్రంలో అంధుల కోసం దాదాపు 26 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ ఫర్ ది బ్లైండ్ నుంచి మరింత ప్రయోజనం పొందగలరని జిల్లా సామాజిక భద్రతా అధికారి మనోజ్ కుమార్ రథ్ అన్నారు.