
త్వరలో అధిక లగేజీకి అదనపు చార్జీలు
భువనేశ్వర్: అధిక లగేజీతో తోటి ప్రయాణికులకు అసౌకర్యం నివారించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. టికెట్ లేని ప్రయాణం సామాజిక నేరం తరహాలో అధిక లగేజీ అదనపు భారం నినాదంతో ఆంక్షలు విధిస్తోంది. విమానయానం తరహాలో ప్రయాణ శ్రేణి ప్రామాణికంగా రైలు ప్రయాణికులకు లగేజీ పరిమితం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అదనపు లగేజీకి అదనపు చార్జీలు వడ్డించే యోచనతో రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రముఖ రైల్వే స్టేషన్లలో తొలుత ఈ చర్యను చేపట్టి అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తారు. అపరిచిత లగేజీపై అదనపు చార్జీలు వడ్డించడంతో అసౌకర్యవంతమైన భారీ లగేజీ తొలగిస్తారు.
అదనపు లగేజీ చార్జీలు
పరిమితి మించిన లగేజీకి అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ బుకింగ్ కంటే ఒకటిన్నర (1.5) రెట్లు ఎక్కువ లెక్కింపుతో జరిమానా విధిస్తారు. కనీస చార్జీ రూ. 30గా పరిగణనలోకి తీసుకుంటారు. కోచ్‌లలో అధిక స్థలాన్ని ఆక్రమించే భారీ బ్యాగులకు కూడా జరిమానాలు విధించే యోచన పరిశీలనలో ఉంది. ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలతో లగేజీ బరువు తూకం వేస్తారు.