
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి
● రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక
రాయగడ: పాత్రికేయులు గ్రామీణ ప్రాంత సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక అన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ సమావేశం హాల్‌లో ఆదివారం రాయగడ జిల్లా వెబ్ మీడియా అసోసియేషన్ ప్రథమ వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రసంగించారు. జిల్లాలో ఎన్నో గ్రామాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయన్నారు. పాత్రికేయులు తమ కర్తవ్యాన్ని నిస్వార్ధంగా నిర్వహించడంతోపాటు అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలన్నారు. నేడు సామాజిక మాధ్యమాల ప్రాధాన్యత పెరిగిందన్నారు. రాయగడ వంటి జిల్లాలో కొండలు, కొనల నడుమ ఎంతో మంది ఆదివాసీలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని, ఇప్పటికీ వారిలో చైతన్యం కొరవడడంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. ఆయా ప్రాంతాల్లో గల సమస్యలను పాత్రికేయులు వెలికితీయాలన్నారు. వెబ్ మీడియా అసోసియేషన్ కార్యదర్శి గురుప్రసాద్ సాహు అసోసియేషన్ వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం గౌరవ అతిథులుగా పాల్గొన్న జీఐఏసీఆర్ ఇంఇనీరింగ్ కళాశాల అధినేత గొవింద ప్రసాద్ రథో, సెంచూరియన్ విశ్వవిద్యాలయం డైరెక్టర్ రాజేష్ కుమార్ పాడీలు పాత్రికేయుల విలువలు గురించి ప్రసంగించారు. అనంతరం జిల్లాలోని కొంతమంది సీనియర్ పాత్రికేయులను సన్మానించారు.