
గజగజ
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2025
● ఒడిశాలో దేశంలోనే అత్యధికంగా ఏనుగుల మరణాలు
● విద్యుత్ షాక్‌తో ఎక్కువ దుర్ఘటనలు
భువనేశ్వర్: రాష్ట్రంలో గజరాజులకు విద్యుత్ షాక్ తగులుతోంది. తరచూ ఈ విచారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఏనుగులు దుర్మరణం పాలవుతున్నాయి. ఈ సంఖ్య జాతీయ స్థాయిలో అత్యధికంగా కొనసాగుతోంది. సంబల్‌పూర్, కటక్, గజపతి, ఢెంకనాల్, అంగుల్, కెంజొహర్ వంటి జిల్లాల్లో విద్యుదాఘాతం కారణంగా పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోతున్నాయి.
కొన్ని సార్లు వేటగాళ్లు పన్నిన విద్యుత్ షాక్ వ్యూహంతో మరికొన్ని సందర్భాల్లో విభాగం నిర్లక్ష్యపు చర్యలతో వేలాడిన విద్యుత్ తీగల తాకిడితో గజరాజులు కుప్ప కూలుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతోంది. గత 6 సంవత్సరాల గణాంకాలు పరిశీలిస్తే రాష్ట్రంలో 104 ఏనుగులు విద్యుదాఘాతం కారణంగా మరణించాయి. 2019–20లో 9 ఏనుగులు మరణించగా, 2020–21లో 8 ఏనుగులు, 2021–22లో 13, 2022–23లో 26, 2023–24లో 15 మరియు 2024–25లో 33 ఏనుగులు మరణించాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోలేదని సమాచారం.
మానవ, గజరాజుల సంఘర్షణ
రాష్ట్రంలో ఏనుగుల దుర్మరణం తరహాలో మానవులు, ఏనుగుల సంఘర్షణలో అవాంఛనీయ సంఘటనలు అధికంగా కొనసాగుతున్నాయి. 2019–20, 2024–25 మధ్య రాష్ట్రంలో మానవ, ఏనుగుల ఘర్షణల్లో అత్యధిక ఏనుగులను కోల్పోయింది. ఒడిశాలో 144 ఏనుగులు మరణించగా అస్సోం (113), తమిళనాడు (79), కర్ణాటక (67), పశ్చిమ బెంగాల్ (45), ఛత్తీస్‌గఢ్ (43) మరియు జార్ఖండ్ (39)లలో ఇది తక్కువగా ఉంది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ డైరెక్టర్ రమేష్ కుమార్ పాండే ప్రకారం, మానవ–ఏనుగుల ఘర్షణలు ఇప్పుడు మొత్తం దేశానికి ఆందోళన కలిగించే అంశంగా మారాయి. ఏనుగులు ప్రధానంగా విద్యుదాఘాతం, రైలు ప్రమాదాలు, విష ప్రయోగం, వేట కారణంగా మరణిస్తున్నాయి. ఈ నాలుగు కారణాల వల్ల ఏనుగులు ప్రధానంగా మరణిస్తుండగా, ఒడిశాలో విద్యుదాఘాతం అత్యంత ఆందోళనకరంగా ఉంది. పశ్చిమ, దక్షిణ, మధ్య ఒడిశాలో విద్యుదాఘాతం కారణంగా అధికంగా ఏనుగులు మరణిస్తున్నాయి. రైలు ప్రమాదాలు అదుపులో ఉన్నాయి. గత 6 ఆర్థిక సంవత్సరాల్లో, ఒడిశాలో వరుసగా 1, 4, 3, 3, 5, 3 ఏనుగులు రైలు ప్రమాదాల్లో మరణించాయి. అయితే, గత 6 సంవత్సరాలలో విష ప్రయోగం కారణంగా ఏనుగుల మరణాలు నమోదు కానట్లు ఆయన స్పష్టం చేశారు. వేటగాళ్ల కారణంగా కొన్ని ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి.
ఆరేళ్లలో..
రాష్ట్రంలో మానవ మరణాలలో కూడా ఒడిశా అగ్రస్థానంలో ఉంది. గత 6 ఏళ్లలో 2021–22 ఆర్థిక సంవత్సరం మినహా మిగతా అన్ని సంవత్సరాల్లో ఒడిశాలో ఏనుగుల దుర్మరణాలు దేశంలో అగ్ర స్థానంలో నిలిచాయి. 2019–20లో ఒడిశాలో 117 మంది ప్రాణాలు కోల్పోగా, 2020–21లో 93 మంది, 2021–22లో 112 మంది, 2022–23లో 148 మంది, 2023–24లో 154 మంది, 2024–25లో 143 మంది మరణించారు. 2021–22లో జార్ఖండ్‌లో 133 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇది 2024–25లో 81కి తగ్గిందని పాండే తెలిపారు. ఈ పరిస్థితి నివారణకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు.

గజగజ