
అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు..
టెక్కలి రూరల్: స్థానిక అక్కపు వీధికి చెందిన మోనింగి శ్రీనివాసరావు(42) శనివారం తన ఇంటి సమీపంలోని రాతి బావిలో శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. శ్రీనివాసరావుకు భార్య స్వాతి, ఇద్దరు పిల్లలు. మసాల పౌడర్‌ల వ్యాపారం చేస్తుండేవాడు. మూడు రోజుల క్రితం పెళ్లిరోజు రావడంతో బయటకు వెళ్దామని భార్య చెప్పింది. అందుకు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన శ్రీనివాసరావు గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుంటుబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం శ్రీనివాసరావు ఇంటి సమీపంలో ఉన్న బావి వద్ద వ్యక్తి మృతదేహం తేలడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రాము బావిలో మృతదేహాన్ని బయటకు తీయించగా మృతుడు శ్రీనివాసరావుగా గుర్తించారు. శ్రీనివాసరావు తండ్రి మోనింగి ప్రభాకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.