
ముఖ్యమంత్రితో రాష్ట్ర అతిధి గృహంలో సమావేశమైన లోకసభ ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తే, ఇతర కమిటీ సభ్యులు
భువనేశ్వర్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల కమిటీల అధ్యక్షుల జాతీయ సమావేశాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర శాసన సభ స్పీకర్ సురమా పాఢి, స్థానిక లోక్ సభ సభ్యురాలు అపరాజిత షడంగి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ బిర్లా ఒక ప్రదర్శనను ప్రారంభించి, ఒక సావనీర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోక్ సభ స్పీకరు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, అభివృద్ధి, సాధికారతలో పార్లమెంటరీ, శాసనసభ కమిటీల పాత్ర శీర్షికతో ఈ సదస్సు వరుసగా 2 రోజులపాటు నిరవధికంగా కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి సంక్షేమ విధానాల అమలులో జవాబుదారీతనం నిర్ధారించడంలో పార్లమెంటరీ, రాష్ట్ర శాసన సభ కమిటీల ముఖ్యమైన పాత్రపై ఈ సదస్సులో లోతుగా చర్చిస్తారని వివరించారు.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ అధ్యక్షుల మొదటి సమావేశం 1976లో న్యూఢిల్లీలో జరిగింది. తరువాత 1979, 1983, 1987, 2001లో వరుసగా ఈ సమావేశాలు జరిగాయి. ఢిల్లీ వెలుపల ఈ సమావేశం జరగడం ఇదే మొదటిసారి. ఆ అవకాశం రాష్ట్రానికి లభించడం మరో విశేషం. రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఉప ముఖ్యమంత్రులు కనక వర్ధన్ సింగ్ దేవ్, ప్రభాతి పరిడా, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయెల్ ఓరం, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ కార్యక్రమానికి హాజరై ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంట్, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలలో షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, ఒడిశా ప్రభుత్వ మంత్రులు, ఒడిశా శాసన సభ సభ్యులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు పార్లమెంటు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీల అధ్యక్షులు మరియు సభ్యులు సహా 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ నెల 30న రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి ముగింపు ప్రసంగంతో ఈ సదస్సు ముగుస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సాధికారత కోసం రాజ్యాంగ రక్షణలను బలోపేతం చేయడం, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉత్తమ పద్ధతులను అవలంభించడంపై ప్రముఖులు ప్రసంగంలో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు, శాసన సభ కమిటీ చైర్మన్, 4 మంది ఎమ్మెల్యేలతో 5 మంది సభ్యులు, ఎస్సీ–ఎస్టీ అభివృద్ధిపై పార్లమెంటరీ కమిటీలోని 30 మంది సభ్యులు హాజరయ్యారు. జాతీయ సదస్సు ఆరంభానికి ముందుగా లోక్‌సభ ఎస్సీ/ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తే మరియు కమిటీ సభ్యులు స్థానిక రాష్ట్ర అతిథి గృహంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని మర్యాదపూర్వకంగా కలిశారు.