
మజ్జిగౌరి మందిరానికి మహర్దశ
● రూ.26 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి మందిరం రూపురేఖలు మారనున్నాయి. సుమారు రూ.26 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం భూమిపూజ జరిగింది. మందిర ప్రధాన అర్చకుడు చంద్రశేఖర్ బెరుకొ, రాజపురోహితుడు బీరంచి నారాయణ దాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో మందిరం మేనేజింగ్ ట్రస్టీ రాయి సింగి బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, బాబు దలాయి, పెద్దీన వాసుదేవరావు, మందిరం సూపరింటెండెంట్ జానకీ వల్లభ్ మహాంతితో పాటు మందిరాభివృద్ధికి టెండర్లు దక్కించుకున్న బరంపురానికి చెందిన ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ కాసీకంచన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతలు పాల్గొన్నారు.
బీజేడీ హయాంలో నిధులు మంజూరు
మజ్జిగౌరి అమ్మవారి దర్శనం కోసం ఇటు తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు అటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక శాతంలో వస్తుంటారు. ప్రతి ఆది, మంగళ, బుధవారాల్లొ వీరి సంఖ్య గణనీయంగా ఉంటుంది. కేవలం ఆదివారం నాడు సుమారు 50 వేల నుంచి 60 వేల మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. వచ్చే భక్తులు ఇక్కట్లు పడుతుండటం గమనించిన అప్పటి బీజేడీ ప్రభుత్వం మందిరం అభివృద్ధి కోసం రూ.36 లక్షల నిధులను కేటాయించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు మొదటి దశలో రూ.26 కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు
మందిరం అభివృద్ధి కార్యక్రమాల కోసం మంజూరైన రూ.26కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మందిరం మేనేజింగ్ ట్రష్టీ రాయిసింగి బిడిక తెలియజేశారు. అమ్మవారి దర్శనం కోసం విరివిగా వస్తున్న భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. ముఖ్యంగా యాత్రికుల నివాసం, క్యూలైన్, షాపింగ్ కాంప్లెక్స్, అన్ని సౌకర్యాలతో గల సౌచాలయం, కేశఖండన శాల వంటివి ప్రాథమిక దశలో నిర్మాణం పనులు ప్రారంభిస్తామని వివరించారు. దశల వారీగా నిధులు మంజూరు కానున్న నేపథ్యంలో రెండొ దశలో ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధమైందని తెలిపారు.

మజ్జిగౌరి మందిరానికి మహర్దశ

మజ్జిగౌరి మందిరానికి మహర్దశ