
3న శ్రీమందిరం పాలక మండలి సమావేశం
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరం పాలక మండలి సమావేశం సెప్టెంబర్ మూడో తేదీన జరుగుతుంది. ఇది కొత్తగా ఏర్పడిన పాలక మండలి తొలి సమావేశం విశేషం. పూరీ గజపతి మహారాజా దివ్య సింగ్ దేవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో కొత్త పాలక మండలి సభ్యులను స్వాగతించి, కొత్త ఉప కమిటీలను ఏర్పాటు చేస్తారు.
వర్షాలకు జయపురంలో భారీ నష్టం
జయపురం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జయపురంలో భారీ నష్టం వాటిళ్లిందని అధికారులు తెలియజేశారు. మొత్తం 28 ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు. నష్టపోయిన కుటుంబాలకు సాయం అందించి ఆదుకోవా లని జయపురం తహసీల్దార్ సవ్యసాచి జెన రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఇళ్లు నష్టం జరిగిన ప్రాంతాలను అధికారులు సందర్శించి అంచనా వేస్తున్నారు. బాధితులకు సాయం అందజేయనున్నట్లు తెలియజేశారు.
యువ న్యాయవాది ఆత్మహత్య
భువనేశ్వర్: నగరం శివార్లు పండర ప్రాంతంలో ఉంటున్న యువ న్యాయవాది ఆత్మాహుతిలో దహనం అయ్యాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. గురువారం అర్ధరాత్రి ఈ విచారకర సంఘటన జరిగింది. మంటల్లో ఆహుతి అయి ప్రాణాలు కోల్పోయిన న్యాయవాది 46 సంవత్సరాల దీపక్ కుమార్ సాహుగా గుర్తించారు. ఈ ప్రాంతంలో ఆయన సివిల్ న్యాయవాదిగా సుపరిచితులు. పెట్రోల్ పోసుకుని తనకు తాను నిప్పంటించుకున్నట్లు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఖాళీ పెట్రోలు సీసాను పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనపరచుకుని పంచనామా కోసం స్థానిక క్యాపిటలు ఆస్పత్రికి తరలించారు. ఇంటి డాబాపైనే దీపక్ కుమార్ సాహు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
గంజాయి పట్టివేత
జయపురం: జయపురం మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వెళ్లే ప్రభుత్వ బస్సులో పట్టణ పోలీసులు 5 కేజీల గంజాయి పట్టుకున్నారు. బస్సులో ఒక బ్యాగ్ ఉందని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు బస్టాండ్‌కు వెళ్లి బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో ఒక ఫ్యాంట్, షర్టుతో పాటు గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం సాయంత్రం జయపురం ప్రభుత్వ బస్టాండ్‌లో విజయవాడ వెళ్లనున్న బస్సులో బ్యాగ్ పడిఉంది. దీనిని ఒక మహిళా ప్రయాణికురాలు తెరిచి చూడగా అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించింది. దీంతో పోలీసులు సమాచారం అందించగా, పోలీసులు వెళ్లి స్వాధీనం చేసుకున్నారని పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్రరౌత్ తెలియజేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. ఇంతకీ ఆ బ్యాగ్ ఎవరు విడిచిపెట్టారు అనేది తెలియాల్సి ఉంది.
ఆలయంలో అగ్నిప్రమాదం
భువనేశ్వర్: పూరీ జిల్లా బ్రహ్మగిరి పోలీస్ ఠాణా పరిధి కంద్‌గోడ గ్రామంలోని ఒక ఆలయంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆలయంలో నిత్య పూజలందుకుంటున్న జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఆలయ అర్చకులు యథాతథంగా గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సంధ్యా హారతి, రోజువారీ సంకీర్తన తర్వాత తలుపులు మూసివేశారు. ఆలయ ద్వారాలు మూసి వేసిన సుమారు గంట తర్వాత ఆలయం నుంచి పొగలు కమ్ముతున్నట్లు కొంతమంది దృష్టిలో పడింది. ఈ విషయం ఆలయ అర్చకులకు తెలియడంతో తక్షణమే అర్చక వర్గంతో స్థానికులు ఆలయానికి పరుగెత్తుకుంటూ వచ్చి తలుపు తెరిచిన తర్వాత మంటలను గమనించారు. మంటలను నివారించి పరిశీలించగా అగ్ని ప్రమాదంలో జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్ర విగ్రహాలతో పాటు కొన్ని పూజా సామగ్రి దగ్ధమైనట్లు గుర్తించారు. అగ్ని ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ ఆలయం లోపల ఉన్న మట్టి దీపం వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా కొంతమంది స్థానికులు ఆలయ సేవకుల నిర్లక్ష్యంతో అగ్ని ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

3న శ్రీమందిరం పాలక మండలి సమావేశం