
బొరిగుమ్మను ఎన్‌ఏసీగా ప్రకటించాలి
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొరిగుమ్మను ఈనెల 31వ తేదీలోగా నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్(ఎన్‌ఏసీ)గా ప్రకటించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ మేరకు బొరిగుమ్మలో శుక్రవారం ఆయన మాట్లాడారు. బీజేడీ హయాంలో దాదాపు ఆ ప్రభుత్వాన్ని 21సార్లు అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగిందన్నారు. అనంతరం బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 5 పర్యాయాలు ప్రశ్నించానని గుర్తు చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 7 జిల్లాల్లో 12 నోటిఫైడ్ కౌన్సిల్‌లు ప్రకటించిందని, అయితే వాటిలో బొరిగుమ్మను చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బొరిగుమ్మను ఎన్‌ఏసీగా ప్రకటించేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయనతో పాటు బొరిగుమ్మ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ గంతాయిత్, కొరాపుట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రతినిధి రామచంద్ర పాఢీ, భాను దొర, లాలు గుప్త, నారాయణ సాహు తదితరులు ఉన్నారు.