
నిమజ్జనం..జరభద్రం!
● మొదలైన గణనాథుని అనుపోత్సవం ● చెరువులు, గెడ్డలు, సముద్రం వద్ద జాగ్రత్తలు తప్పనిసరి
● మద్యానికి దూరంగా ఉండాలంటున్న అధికారులు
టెక్కలి : వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు మొదలయ్యాయి. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన అనుపోత్సవంలో పాల్గొనేందుకు యువకులు పోటీపడుతుంటారు. ఈ సమయంలో కొందరు అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిమజ్జనం సమయంలో మద్యం సేవించి చెరువుల్లో, కాలువల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం..
ఇటీవల కురుస్తున్న వర్షాలకు దాదాపు అన్ని చెరువులు, సాగు నీటి కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. ఉపాధి పనులు జరగడంతో చాలావరకు లోతుగా ఉన్నాయి. అది గమనించకుండా రాత్రి సమయాల్లో నిమజ్జనాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సముద్రతీరంలో నిమజ్జనాలు మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. చిన్నారులను చెరువులు, సాగునీటి కాలువలు, సముద్రతీరాల వద్దకు తీసుకువెళ్లకపోవడం ఉత్తమం. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో ఉంచుకుని వినాయక నిమజ్జనాల్లో జాగ్రత్తలు పాటించాలని యువకులకు అధికారులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ఆయా ఉత్సవ కమిటీ సభ్యులే భాద్యత వహించాలని ఆదేశాలు చేస్తున్నారు. నిమజ్జనాల్లో కొన్ని రకాల జాగ్రత్త చర్యలు, ఆంక్షలపై టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ విజయకుమార్ తదితరులు ఉత్సవ కమిటీ సభ్యులతో ఇటీవల సమావేశం నిర్వహించి సూచనలు అందజేశారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
● పోలీసులు సూచించిన మార్గంలోనే నిమజ్జన ఊరేగింపు చేయాలి. విగ్రహాన్ని తరలించే వాహనాల సమాచారం ముందస్తుగా అందజేయాలి. డీజే కు అనుమతి తీసుకోవాలి.
● నిమజ్జనం సమయంలో విద్యుత్ తీగల ప్రభావం లేకుండా చూసుకోవాలి.
● నిమజ్జన ఊరేగింపులో వేషధారణలపై ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
● మద్యం సేవించి నిమజ్జనాల్లో పాల్గొనేవారిపై కఠినమైన చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు ఉన్నాయి
● పోలీసులు గుర్తించిన సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేయాలి.
● నిమజ్జనాల్లో చిన్న పిల్లలు లేకుండా చూసుకోవాలి.
అలా చేస్తే చర్యలు..
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మద్యం సేవించి తగాదాలకు పాల్పడినా, నిమజ్జనాల సమయంలో మద్యం సేవించినా చర్యలు చేపడతాం. మద్యానికి దూరంగా ఉంటూ నిమజ్జనాలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే ఉత్సవ కమిటీ సభ్యులే బాధ్యులవుతారు.
– డి.లక్ష్మణరావు, డీఎస్పీ, టెక్కలి

నిమజ్జనం..జరభద్రం!