
రసాభాసగా మున్సిపల్ సమావేశం
● అధికారుల వైఖరికి నిరసనగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల వాకౌట్
పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. పోలీసు పహారా మధ్య మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ సమావేశం నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. గత సమావేశంలో తెలిపిన అంశాలపై తగిన వివరణ ఇవ్వకుండా ఎలా ఈ సమావేశమవుతారని మున్సిపల్ వైస్ చైర్మన్ మీసాల సురేష్‌బాబు, కౌన్సిలర్లు దుర్గాప్రసాద్ పండా, బెల్లాల శ్రీనివాసరావు, పప్పల ప్రసాదరెడ్డి, పిచ్చుక అజయ్, కర్రి మాధవరావు, సవర సోమేశ్వరరావు, బోర చంద్రకళ, దున్న నిర్మల, శార్వాన గీతరవి, దువ్వాడ సత్యవతి, అంబటి మాధురి, పోతనపల్లి ఉమాకుమారి, బల్ల రేవతి, కోఆప్సన్ సభ్యుడు బమ్మిడి సంతోస్‌కుమార్ తదితరులు ప్రశ్నించారు. తగిన సమాధానం రాకపోవడంతో వారంతా పోడియం ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. అయినప్పటకీ కమిషనర్ ఎన్.రామారావు నుంచి తగిన సమాధానం రాకపోవడంతో బయటకు వెళ్లి బైఠాయించారు. అప్పటికే సభలో 8మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సమావేశానికి ముందుగా ఈ విషయం తెలియక ముగ్గురు వైఎస్సార్ సీపీ సభ్యులు శిస్టు బృందావతి, జోగి సతీస్‌కుమార్, బోనెల చంద్రమ్మలు రిజిస్టరు పుస్తకంపై సంతకాలు చేశారు.దీంతో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారని కోరం సరిపోయిందని కమిషనరు సమావేశం తూతూమంత్రంగా ముగించేశారు. 37 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తీర్మానాలు చేసుకున్నారు. వార్డుల్లో తమకు సంబంధం లేకుండా పనులు జరగుతున్నాయని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.