
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే స్టేషన్ సమీపంలో బండిపేట వద్ద రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. తల చితికిపోయి గుర్తు పట్టనివిధంగా మారింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు కోటబొమ్మాళి మండలం సరియా బొడ్డపాడు గ్రామానికి చెందిన చాప రాములు(67)గా గుర్తించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. ఆత్మహత్య అనే విషయమై దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
రణస్థలం: రణస్థలం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బుడుమూరు శిరీష(22) అనే మహిళ మృతి చెందింది. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 10.15 గంటల సమయంలో సూర్క స్కూల్ జంక్షన్‌లో ఆటో మలుపు తిప్పుతుండగా డివైడర్‌ను ఢీకొట్టి ఆటో బోల్తాపడింది. అందులో కూర్చున్న శిరీష బయటకు తుళ్లిపడగానే విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినది. శిరీష తన భర్తతో గొడవల నేపథ్యంలో మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేద్దామని వచ్చింది. ఈ క్రమంలో జె.ఆర్.పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో అమ్మమ్మ ఇంటి వద్ద మాట్లాడి తిరిగి స్వగ్రామం లావేరు మండలం పాతకుంకాం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటోలో ఉన్న మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎస్సై ఎస్.చిరంజీవి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు మృతి
రణస్థలం: జె.ఆర్.పురం పంచాయతీ సీతంవలస సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువకుడు కేటీఎం బైక్‌పై జే.ఆర్.పురం థియేటర్ వైపు నుంచి సీతంవలస మీదుగా లావేరు వెళ్తుండగా శ్మశానం మలుపు వద్ద గురువారం రాత్రి 9 గంటల సమయంలో అదుపుతప్పి పడిపోయారు. బైక్ నడుపుతున్న వనుము ప్రభాస్(20) బైక్ ముందు పెట్రోల్ ట్యాంక్‌ను బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న రాంబాబు తుప్పల్లోకి తుళ్లిపోయి గాయాలతో బయటపడ్డాడు. మృతుడు ప్రభాస్‌ది లావేరు మండలం సుభద్రాపురం. తల్లిదండ్రులు చిట్టిబాబు, సత్యవతి, సోదరుడు ఉన్నాడు. గాయపడిన రాంబాబు స్వగ్రామం మురపాక. ఇద్దరూ గంజాయి మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై ఎస్.చిరంజీవి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎచ్చెర్ల : బుడగట్లపాలెం సముద్రతీర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని గురువారం సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్, ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీ (సీఐసీఈఎఫ్) బెంగళూరు బృందం సాధారణ పరిశీలన చేపట్టింది. కాకినాడ వద్ద ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌ను తనిఖీకి వచ్చిన వీరు బుడగట్లపాలెం హార్బర్‌ను కూడా పరిశీలించారు. గతంలో చేసిన ప్రతిపాదనల్లో మార్పులు చేపడుతూ డబ్ల్యూ.ఏపీ.సీవోసీ పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఇక్కడ పనులకు సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు నూతన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కార్యక్రమంలో సీఐసీఈఎఫ్ డైరెక్టర్ ఎన్.రవిశంకర్, డాక్టర్ బెలియప్ప, ఏపీ మేరీ టైంబోర్డ్ ఎస్‌ఈ నగేష్, మత్స్యశాఖ డీడీ వై.సత్యనారాయణ, ఏఫ్‌డీవో రవికుమార్, సర్పంచ్ అల్లుపల్లి రాంబాబు, ఎంఎఫ్‌సీఎస్ సొసైటీ ప్రెసిడెంట్ సీహెచ్ శ్రీరాములు, వైస్ ప్రెసిడెంట్ యు.అప్పన్న, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ కార్యకర్త హత్యకేసులో.. ముగ్గురికి రిమాండ్
శ్రీకాకుళం క్రైమ్ : గతేడాది ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేటలో వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌ను టీడీపీ మద్దతుదారులు దారి కాచి దాడిచేయడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో ఎచ్చెర్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తొమ్మిది మందిని చేర్చి నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా మరో ముగ్గురు శీపాన శివకుమార్, కొత్తకోట సాయి, జమ్మి వేణులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్ పేర్కొన్నారు.

రైలు ఢీకొని వృద్ధుడు మృతి