
వేడుకగా నువా ఖాయి
భువనేశ్వర్: రాష్ట్ర వ్యవసాయ ప్రాధాన్య పండగ నువా ఖాయి వేడుకని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి దంపతులు గురువారం రాజ్ భవన్‌లో సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ ఒడిశా ఆరాధ్య దైవం సమలేశ్వరి దేవికి ప్రత్యేక పూజాదులు నిర్వహించారు. నువా ఖాయి పురస్కరించుకుని సమలేశ్వరి మాతకు ఈ సీజను సాగు తొలి పంట బియ్యం నవాన్నంగా సమర్పించడం ఆచారం. ఆచారం ప్రకారం పూర్తి స్థానిక సంప్రదాయాలతో నవాన్న నివేదన పూజాదుల్లో గవర్నరుతో ఆయన సతీమణి జయశ్రీ కంభంపాటి భక్తి శ్రద్ధలతో పాలుపంచుకున్నారు. పూజాదులు ముగిసిన తర్వాత గవర్నర్ రాజ్ భవన్ అధికారులు, సిబ్బందికి ప్రసాదం పంపిణీ చేశారు.
గవర్నర్ కమిషనర్, కార్యదర్శి రూపా రోషన్ సాహు తదితర రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నువా ఖాయి కృతజ్ఞతపూర్వక వేడుకగా పేర్కొన్నారు. రైతాంగం, ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఈ సంప్రదాయాన్ని అందరితో కలిసి మెలిసి జరుపుకోవడంపై గవర్నర్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భంగా ఒడిశా ప్రజలందరికీ శ్రేయస్సు, ఆనందం, ఉన్నత ఆరోగ్యం సిద్ధించాలని గవర్నర్ శుభాకాంక్షలు తెలియజేశారు.