
రైతన్నలకు ఆర్థిక సాయం
పర్లాకిమిడి: జిల్లాలోని రైతులుకు నువాఖయి పండగ సందర్భంగా స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాల్‌లో పీఎం కిసాన్ ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని రాష్ట్ర వాణిజ్య, రవాణా, ఖనిజశాఖ మంత్రి బిభూతి జెన్నా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిసాన్ పథకమే ప్రధానమంత్రి కిసాన్ రైతు బంధు పథకంగా అమలు చేస్తున్నట్టు మంత్రి జెన్నా అన్నారు. కౌలు రైతులుకు, తక్కువ భూమి ఉన్న రైతన్నలకు 2025–26లో రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు నువాఖయి పండగ సందర్భంగా నేరుగా రైతుల అక్కౌంట్లలో వేస్తున్నామని మంత్రి అన్నారు. గజపతి జిల్లాలో మొత్తం 64,905 వేల మంది రైతులకు రూ.6 వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని మంత్రి అన్నారు. గత ఏప్రిల్ నెలలో అక్షయ తృతీయ పండగ సందర్భంగా రూ.6 వేలను రైతన్నలకు వారి ఖాతాలకు అందజేశామని, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారిక మందుల కొనుగోలుకు ఉపయోగపడతాయన్నారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, అదనపు కలెక్టర్ మునీంద్ర హానగ, ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా, ఏడీఎం ఫల్గుని మఝి, జిల్లా ముఖ్యవ్యవసాయ అధికారి రవీంద్ర కుమార్ హదక్, జిల్లా పరిషత్ సీడీఓ శంకర కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా తదితరులు పాల్గొన్నారు.