
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం
జయపురం: సమాజంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడమే పోలీసు సమితి సమావేశాల ప్రధాన లక్ష్యమని జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కాశ్యప్ అన్నారు. బుధవారం జయపురంలోని సభాగృహంలో పోలీసు యంత్రాంగం అమొ పోలీసు సమితి(మన పోలీసు సమితి) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, పోలీసుల మధ్య సత్సంబంధాలు, అవగాహన కల్పించటం వల్ల సహృద్భావ సంబంధాలు నెలకొంటాయని చెప్పారు. కమ్యూనిటీ పోలీసింగ్ బలోపేతం చేయడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఎటువంటి సమాచారం అందించాలన్నా, ఫిర్యాదు చేయదలచుకున్నా పట్టణ పోలీసు స్టేషన్ 94389 16930, సదర్ పోలీసు స్టేషన్ 94389 16928 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో జయపురం మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, వైస్ చైర్‌పర్సన్ బి.సునీత, జయపురం సదర్ పోలీసు అధికారి సచీంధ్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.