
భారీగా గంజాయి స్వాధీనం
ఆమదాలవలస: పట్టణ పరిసర ప్రాంతాల్లో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ పి.సత్యనారాయణ తెలియజేశారు. ఈ మేరకు స్థానిక పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఆమదాలవలస ఎస్‌ఐ ఎస్.బాలరాజుకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు పురపాలక సంఘం పరిధిలోని 18వ వార్డు కండ్రపేట వద్దనున్న శ్మశానవాటిక వద్ద దాడులు చేపట్టామన్నారు. ఈ దాడుల్లో గంజాయితో ఇద్దరు యువకులు, ఒక మైనర్ బాలుడు పట్టుబడ్డారని పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 21.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడినవారిలో పట్టణంలోని కొత్త కండ్రపేటకు చెందిన కారుణ్య జగదీష్, ఐదో వార్డు సొట్టవానిపేట టీజీఆర్ నగర్ కాలనీకి చెందిన సయ్యద్ తహీర్ బాబుతో పాటు ఒక మైనర్ బాలుడు ఉన్నారన్నారు.
ఒడిశాలో కొనుగోలు చేసి...
వీరంతా ఒడిశా రాష్ట్రంలో బరంపురం సమీపంలోని కళ్లికోట్‌కు చెందిన నీలాంచల్ పట్నాయక్ వద్ద గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తెలుపడంతో వీరితోపాటు ఆయనను కూడా అరెస్టు చేశారు. వీరు కొనుగోలు చేసిన గంజాయిని రైలు మార్గం ద్వారా ఆమదాలవలసకు తరలిస్తూ, కొంతమొత్తం వీరు సేవిస్తూ మరికొంత విక్రయిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. నిందితుడు కారుణ్య జగదీష్‌పై ఇప్పటికే 9 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2024లో గంజాయి కేసు నమోదు అయ్యిందని ఇతనిపై స్టేషన్‌లో హిస్టరీ సీట్ కూడా ఉన్నట్లు తెలిపారు. అలాగే సయ్యద్ తాహిర్‌పై రెండు దొంగతనాలు కేసులు నమోదై ఉన్నాయన్నారు. మైనర్ వ్యక్తిపై మూడుసార్లు దొంగతనం కేసులు నమోదు అయ్యాయని, ఇతను ఇదివరకే అబ్జర్వేషన్ హోమ్‌కు వెళ్లి బయటకు వచ్చినట్లు చెప్పారు. పట్టుబడిన ముగ్గురు వ్యక్తులపై మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు నలుగురిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు వెల్లడించారు.