సాంకేతిక పథం..! | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక పథం..!

Aug 7 2025 10:33 AM | Updated on Aug 7 2025 10:33 AM

సాంకే

సాంకేతిక పథం..!

‘ఉపాధి’లో...
● ఈనెల 8వ తేదీ నుంచి కొత్తయాప్‌ ● ఇకపై ముఖ ఆధారిత హాజరు ● రోజుకు రెండు పర్యాయాలు ఫొటోలు తీయాల్సిందే

హిరమండలం: ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఈనెల 8వ తేదీ నుంచి హాజరు నమోదుకు సరికొత్త ఆలోచనను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. దీనిలో భాగంగా ఒక కొత్త యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్‌లో జాబ్‌కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో సదరు ఉపాధి వేతనదారు పనికి వచ్చిన అనంతరం అతని ఫొటో(ఐరిష్‌) తీస్తారు. ఒకవేళ యాప్‌లో నమోదు చేసిన వ్యక్తి ఫొటోకు మ్యాచ్‌ అవ్వకుంటే నగదు చెల్లింపులు చేసేందుకు వీలుండదు. ఈ యాప్‌ను శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో మండల స్థాయిలో ఉండే ఉపాధి అధికారులు తమ పరిధిలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లుకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే ఉపాధి ఏపీవోలు పని జరిగే ప్రాంతాల్లో కూలీలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

అత్యాధునిక సాంకేతికతతో....

కొత్త మస్టర్‌ విధానంలో అత్యాధునిక సాంకేతికతను తీసుకొచ్చి గ్రామ, మండల, జిల్లాలోని భౌగోళిక పరిస్థితిని అంచనా వేసేలా యాప్‌ రూపొందించారు. దీనిలో ఇప్పటికే నమోదైన కూలీల వివరాలు, జాబ్‌కార్డు, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌ పుస్తకం, కూలీల తాజా ఫొటోతో ఈకేవైసీ చేయించాలి. రెండు పర్యాయాలు ఫొటో తీసే సమయంలో వీటిలో ఏ ఒక్కటి సరిపోకపోయినా నమోదు కాదు. యాప్‌లో ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఉపాధి ఏపీవోలు రోజుకు రెండు గ్రామాలకు సంబంధించిన పనుల ఫొటోలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో అటు ఉపాధి సిబ్బందికి, ఇటు కూటమి నాయకుల జేబులు నింపుకునే విధానానికి పెద్ద గండి పడినట్లు అవుతుంది.

హాజరు ఇలా..

ముఖ ఆధారిత హాజరు తీసుకునే విధానంలో కొత్త పద్ధతులను అవలంభించేలా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం ఫీల్డ్‌ అసిస్టెంట్లును తొలగించి, తమవారిని నియమించుకున్న కూటమి నాయకులకు ఈ కొత్త పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత గొంతులో వెలక్కాయ పడిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ ఆధారిత హాజరు విధానంలో భాగంగా కూలీల ఫొటోలను సెల్‌ఫోన్‌లో తీసుకుని జాతీయ మొబైల్‌ పర్యవేక్షణ వ్యవస్థకు (ఎన్‌ఎంఎంఎస్‌)కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫీల్డ్‌ అసిస్టెంట్లు పనిచేసే కూలీల ఫొటోలను తీసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒకరు తరుపున మరొకరు హాజరైనట్లు చూపితే ఆన్‌లైన్‌లో హాజరు తీసుకోదు.

4 గంటల తర్వాతే ఫొటో అప్‌లోడ్‌

పని ప్రదేశంలో మొదటి ఫొటోను ఉదయం 6 గంటలకు తీసి అప్‌లోడ్‌ చేస్తే, అనంతరం 4 గంటల తర్వాత అనగా ఉదయం 10 గంటలకు ఫోన్‌లో మరోసారి ఫొటో అప్‌లోడ్‌ చేయాలని సిగ్నల్‌ వస్తుంది. ఆ తర్వాత ఫొటో అప్‌లోడ్‌ చేయకపోతే ఆరోజు కూలీలకు నగదు చెల్లింపులు ఉండవు. ఇలా చేయడం వలన ఇదివరకు మస్టర్ల మాయాజాలం చేసేవారికి ఇబ్బందులు తప్పవు. కాగా అదే సమయంలో ఉపాధి వేతనదారులకు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. మూడు నెలలుగా వేతనదారులకు నగదు చెల్లింపులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నగదును విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టించింది. అయితే రెండు రోజుల్లో కొత్త విధానం ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో తమకు రావాల్సిన మూడు నెలలు వేతనాల పరిస్థితి ఏంటిని ప్రశ్నిస్తున్నారు.

అవకతవకలకు చెక్‌

ఉపాధి పనుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాప్‌ను ఈనెల 8వ తేదీ నుంచి అమలు చేయనున్నాం. దీంతో ఉపాధి పని జరిగేచోట ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు. అలాగే వేతనదారులు కూడా ఒకరి బదులుగా మరొకరు పనిచేస్తున్నారనే విమర్శలకు చెక్‌ పడుతుంది. పని జరిగేచోట నాలుగు దిక్కుల్లో ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వేతనదారులకు నగదు చెల్లింపులు త్వరగా చేపడతాం.

– ఎ.శ్రీనివాసరావు, ఏపీవో, హిరమండలం

సాంకేతిక పథం..!1
1/2

సాంకేతిక పథం..!

సాంకేతిక పథం..!2
2/2

సాంకేతిక పథం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement