
శ్రీ మందిరం ప్రవేశానికి విఫలయత్నం
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాత పూరీ శ్రీ జగన్నాథుని దేవస్థానం లోపలి ప్రాకారంలో దృశ్యాల చిత్రీకరణ పూర్తిగా నిషేధం. ఇటీవల కాలంలో ఈ నిషేధ ఆంక్షల్ని అధిగమించి అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో పవిత్ర శ్రీ మందిరం లోపలి దృశ్యాల్ని చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళ వారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిపుల్ పాల్ అనే భక్తుడు రహస్య కెమెరా అమర్చిన కళ్ల జోడుతో ప్రవేశించి శ్రీ మందిరం లోపలి దృశ్యాలు చిత్రీకరించబోయి పట్టుబడ్డాడు. గత 8 రోజుల స్వల్ప వ్యవధిలో ఇలాంటి సంఘటన వరుసగా ఇది మూడోది కావడంతో శ్రీ మందిరం భద్రతా వ్యవస్థ నిర్వాహక వర్గాలు కలవరపడుతున్నాయి. తాజా సంఘటనలో శ్రీ మందిరం పశ్చిమ ద్వారం ప్రాంగణంలో భక్తుని సందిగ్ధ కదలికలపై సందేహించిన ఆలయ పోలీసులు అదుపులోకి తీసుకుని పరిశీలించారు. పరిశీలనలో సందేహం ధ్రువీకరించి సింహ ద్వారం ఠాణా పోలీసులకు నిందితుడిని అప్పగించారు. అతడికి వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సింహ ద్వారం ఠాణా పోలీసు వర్గాలు తెలిపాయి.
ఆలయ భద్రత కోసం ప్రత్యేక ఎస్‌ఓపీ జారీ: ఎస్పీ
శ్రీ మందిరం లోపలి దృశ్యాల అక్రమ చిత్రీకరణ కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పినాక్ మిశ్రా తెలిపారు. ప్రధానంగా ఇటీవల కాలంలో రహస్య కెమెరా అమరికతో కళ్లజోడు ధరించి లోనికి ప్రవేశించి అలజడి రేపుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ చర్యల కట్టడికి త్వరలో నిర్ధారిత కార్యాచరణ విధానం ఎస్‌ఓపీ జారీ చేయనున్నట్లు ఎస్పీ వివరించారు. రహస్య కెమెరా కళ్లజోడు వ్యవహారం గుర్తించడంలో భద్రతా సిబ్బందికి ప్రత్యేక తర్ఫీదు కల్పిస్తారు. అవసరమైతే, మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొంత మంది యూట్యూబర్లు డబ్బు సంపాదించడం కోసం ఇలా చేస్తున్నారు. దీనిని నివారించడానికి ఒక చట్టం తీసుకురావాలని శ్రీ మందిరం పాలక మండలితో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.