
● తీరిన నదీ కష్టాలు
రాయగడ: నది మీదుగా తమ గ్రామానికి వెళ్లేందుకు వీలుగా గ్రామస్తులు శ్రమదానంతో కర్ర వంతెనను నిర్మించుకున్నారు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తమ రాకపోకలకు మార్గం సుగమమం చేసుకున్నారు. జిల్లాలోని కాసీపూర్ సమితి గొడిబాల్లి పంచాయతీ పరిధిలోని పనసగుడ గ్రామానికి చేరాలంటే మధ్యలో ఉన్న నదిని దాటుకుంటూ వెళ్లాల్సిందే. వర్షాకాలంలో వరద ప్రభావంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు వంతెనను నిర్మించాలని అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామస్తులంతా ఏకమై సమీపంలోని అడవుల నుంచి కర్ర దుంగలను సమీకరించారు. వీటితో సుమారు పది అడుగుల దూరం వరకు నదిపై వంతెనను నిర్మించుకుని రాకపొకలకు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ గ్రామం మీదుగా మరో అయిదు గ్రామాలకు చెందిన ప్రజలకు రాకపోకలకు అవకాశం వచ్చింది.