
పాముకాటుతో యువకుడికి అస్వస్థత
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి సెరిగుమ్మ పంచాయతీ పర్లాపాయి గ్రామానికి చెందిన కార్తీ పిడిసిక అనే యువకుడు పాముకాటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. పర్లాపాయి గ్రామానికి చెందిన కార్తీ పిడిసిక తమ పొలంలో కాపుకాసిన మొక్కజొన్న పొత్తులను సేకరించేందుకు వెళ్లాడు. మొక్కజొన్న పొత్తులు ఏరుతున్న సమయంలో ఒక పాము అతని కాలిపై కాటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. పొలంలోకి వెళ్లిన కార్తీ ఇంటికి రాలేదని తండ్రి వెళ్లి చూడగా ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో గ్రామస్తుల సాయంతో ఇంటికి తీసుకొచ్చి నాటువైద్యం చేయించాడు. అయితే నాటువైద్యం వల్ల ఎటువంటి ఫలితం దక్కకపోవడంతో వెంటనే అతనిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్సావస్థలో ఉన్న కార్తీ ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు చెబుతున్నారు.