
పంటల సాగుపై దృష్టిసారించాలి
రాయగడ: జిల్లా కలెక్టర్ కార్యాలయం సద్భావనా సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అధ్యక్షతన జిల్లాస్థాయి వ్యవసాయ ప్రణాళిక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఏ పంటలపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు, రైతులకు ఎటువంటి వాణిజ్య పంటలు వారికి మేలు చేకూరుస్తాయి తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి వనరులు, విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంటున్నాయా..లేదా అని ఆరా తీశారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడంతోపాటు వాటిని సంరక్షించడంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. నూనెగింజలు, వాణిజ్య పంటల్లో భాగంగా పత్తి, తృణధాన్యాల సాగును విస్తృతపరచాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. సేంద్రియ ఎరువల వినియోగంతో కలిగే లాభాల గురించి తెలియజేయాలని సూచించారు. దీని ద్వారా సాగుభూములు సారవంతాన్ని కోల్పోవన్న విషయం రైతులకు పూర్తిగా అవగాహన కలిగేలా సంబంధిత శాఖ అధికారులు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా పథకం ద్వారా కలిగే ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 43,201 హెక్టార్లలో వివిధ పంటలను పండించేందుకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయశాఖాధికారులు వివరించారు.
కలెక్టర్ అశుతోష్ కులకర్ణి