
రెవెన్యు కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు
భువనేశ్వర్: సుపరిపాలన చర్యల్లో భాగంగా సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ హాజరు నమోదు వ్యవస్థని ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఈ దిశలో రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం తొలి అడుగు వేయడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యు కార్యాలయాల్లో సిబ్బంది సకాలంలో విధులకు హాజరు విషయం పరిశీలనకు అనుకూలంగా బయోమెట్రిక్ వ్యవస్థని అమలు చేయాలని విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి దిగంత రౌత్రాయ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. ఈ మేరకు సత్వర చర్యలు చేపట్టి బయోమెట్రిక్ వ్యవస్థ ఏర్పాటు సమగ్ర వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. గత నెల 21వ తేదీన రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి కటక్ ప్రాంతంలో విభాగం ప్రభుత్వ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా అత్యధిక సిబ్బంది, అధికారులు గైర్హాజరుని మంత్రి గుర్తించారు. ఆరా తీయగా ఆలస్యంగా విధులకు హాజరు అవుతున్నట్లు తేలింది. దీంతో మంత్రి బయోమెట్రిక్ హాజరు నమోదు వ్యవస్థ అమలు కోసం ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వాస్తవ కార్యాచరణకు సన్నాహాలు ఊపందుకున్నాయి.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కొత్త అధ్యక్షురాలిగా బబితా పాత్రో
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఓఎస్ సీపీసీఆర్) అధ్యక్షురాలిగా బబితా పాత్రోను నియమించినట్లు మంగళ వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో ఆరుగురిని ఈ కమిషన్ సభ్యులుగా నియమించారు. బబితా పాత్రో బరంపురం సోమనాథ్ నగర్ మయూర్ విహార్ నివాసిని. ఆరుగురిని ఒడిశా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యులుగా నియమించారు. వారిలో సుకేషి ఓరం (చంపువా – కెంజొహర్), కల్పనా లెంక (బసంతి కాలనీ, రౌర్కెలా), చందనా దాస్ (బొడొగొడొ బ్రిట్ కాలనీ, భువనేశ్వర్), కస్తూరి మిశ్రా (బాపూజీ నగర్, భువనేశ్వర్), మనస్మిత ఖుంటియా (చొరొంపా, భద్రక్), సుజాతా నాయక్ (బొమిఖల్, భువనేశ్వర్) ఉన్నారు.

రెవెన్యు కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు