
హోంగార్డు అభ్యర్థుల నిరసన
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాణిపేట డీపీఓ కార్యాలయానికి దక్షిణమండళం (బరంపురం) ఐజీ నీతిశేఖర్ శనివారం సందర్శించారు. ఇటీవల హోంగార్డులు పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కోందరు అభ్యర్థులు రాణిపేట ఎస్పీ కార్యాలయం వద్దకు విచ్చేసి నిరసన చేశారు. ఈ విషయం దక్షిణ మండళం ఐజీ దృష్టికి తీసుకువెళ్లాలని అభ్యర్థులు కోరగా అందుకు పోలీసు విభాగం నిరాకరించగా.. అక్కడ హోంగార్డు అభ్యర్థులు పోలీసుల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. హోంగార్డుల అభ్యర్థుల ఎంపిక సమయంలో ఇద్దరు అభ్యర్థులు పరుగుపందెం పరీక్షలో మృతి చెందారు. ఇప్పటివరకు హోంగార్డు పోస్టుల ఎంపిక జాబితాను అధికారులు విడుదల చేయలేదు. చాలా సమయం వరకు ఐజీ నితి శేఖర్ బయటకు రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తర్వాత ఐజీ బయటకు వచ్చి.. అభ్యర్థుల అభియోగాలు విని దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు. హోంగార్డు పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి వెళ్లిపోయారు.