భువనేశ్వర్: రాష్ట్రంలో మహిళలు, యువతులు, విద్యార్థినులు, బాలికలకు భద్రత, రక్షణ పూర్తిగా లోపించింది. ఈ వర్గాలపై నేరాలు నిత్యకృత్యాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో మహిళ మనుగడ క్షణ క్షణం భయం భయంగా తయారైందని విపక్ష బిజూ జనతా దళ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ జోక్యం ఆశిస్తు బిజూ జనతా దళ్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ కమిషనర్ల ఆధ్వరంలో స్మారక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సోమవారం శాంతియుతంగా నిరసన ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించి ఆర్డీసీలకు స్మారక పత్రం అందజేశారు. బాలాసోర్ ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాల విద్యార్థిని సౌమ్య శ్రీ బీసీ ఆత్మాహుతి మరణం, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆగంతకుల నిప్పు దాడితో మృత్యు పోరాటం చేస్తున్న పూరీ జిల్లా బొలొంగా ప్రాంతపు బాలిక దయనీయ పరిస్థితులు రాష్ట్రంలో సగటు మహిళకు రక్షణ కొరవడిన వైపరీత్య పరిస్థితులకు నిలువెత్తు తార్కాణంగా పేర్కొన్నారు. కటక్‌లోని సెంట్రల్ రెవెన్యూ కమిషనర్ కార్యాలయం ఆవరణలో చేపట్టిన ఆందోళనలో 10 జిల్లాల నుంచి బిజూ జనతా దళ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒడిశాలో మహిళలపై జరిగిన నేరాలు, వారి రక్షణ, ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీ విద్యార్థి మరణంపై న్యాయ విచారణ జరపాలని వీరంతా డిమాండ్ చేశారు. రాష్ట్ర హై కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి అధ్యక్షతన ఈ విచారకర సంఘటనపై న్యాయ విచారణ జరపాలని బీజేడీ డిమాండ్ చేసింది. సంబల్‌పూర్, బరంపురం ఆర్డీసీ కార్యాలయాల ఆవరణలో ఈ తరహా ఆందోళనలు ఏక కాలంలో చేపట్టి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యంపై నిరసన వ్యక్తం చేశారు.