
బోల్ భం శంఖారావం
దండకారణ్యంలో ..
కొరాపుట్:
ఐదు రాష్ట్రాల ఆరాధ్య క్షేత్రం గుప్తేశ్వరం బోల్ భం శంఖారావంతో ధ్వనించింది. సోమవారం కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితిలోని దండకారణ్యం పూర్తి కాషాయమయంగా మారింది. శ్రావణ మాస సోమవారం సంధర్బంగా సహజ సిద్ధ పుణ్యక్షేత్రంలో శివలింగానికి పవిత్ర జలంలో అభిషేకం చేయడానికి వేల సంఖ్యలో కాషాయధారులు తరలి వచ్చారు. సోమ వారం వేకువ జాముకే వేల సంఖ్యలో భక్తులు చేరి పోయారు. అర్ధరాత్రి పన్నెండుకి గుహ గేట్లు తెరవడంతో భక్తులు తమ పాద యాత్ర ద్వారా తెచ్చిన పవిత్ర జలంతో గుప్తేశ్వరుడికి అభి షేకం చేశారు. రాత్రి పన్నెండుకి తలుపు తీస్తారనే సమాచారంతో ముందు రోజు సాయంత్రం 5 గంటల నుంచి భక్తులు క్యూలో ఉన్నారు. ఈ క్యూ రెండు కిలోమీటర్ల వరకు కొనసాగింది.
తరలి వచ్చిన పక్క రాష్ట్రాల ప్రజలు
ఈ సోమవారం గుప్తేశ్వరానికి సుమారు యాభై వేల మంది ప్రజలు తరలి వచ్చినట్లు అంచనా. ఒడిశాతో పాటు చత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బంగ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చా రు. ఈ యాత్ర శ్రావణ మాసంలో ప్రతి సోమవారం జరగనుంది. దారి పొడవునా అనేక స్వ చ్ఛంద సంస్థల కార్యకర్తలు భారీ ఎత్తున భక్తులకు ఉచిత సౌకర్యాలు కల్పించారు. పాత్రో పుట్ వంతెన నుంచి బొయిపరిగుడ, రామ గిరి, డోక్రి ఘాట్‌ల మీదుగా ప్రతి చోట ఆహారం, వైద్యం, పాద సేవలు అందజేశారు. నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ బోల్ భం యాత్ర జరుగుతోంది. ఇక్కడ బోల్‌భం భక్తులను పట్టించుకునే నాథుడే లేకపోయాడు. ఇప్పుడు స్వచ్ఛందంగా సేవలు అందిస్తుండడంతో పరిస్థితి మారింది.
జయపూర్ సబ్ కలెక్టర్ రంగ ప్రవేశం
గతంలో ప్రభుత్వ కేవలం మహాశివరాత్రికే గుప్తేశ్వరం గుర్తు చేసుకొనేది. ఏ అధికారీ బోల్‌భం భక్తులను పట్టించుకోలేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు లోతు తెలియక శబరి నదిలో మునిగిపోయేవారు. కానీ ఈ ఏడారి జయపూర్ సబ్ కలెక్టర్ ఆకవరం సస్య రెడ్డి భక్తుల భద్రతకి గట్టి చర్యలు తీసుకున్నారు. ఆదివారం రాత్రంతా గుప్తేశ్వరంలో మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షించారు. శబరి నది వద్ద అగ్ని మాపక సిబ్బందితో పాటు ఓడ్రాఫ్ టీమ్‌ని మోహరించారు. పెద్ద ఎత్తున పోలీసు, అటవీ, రెవెన్యూ, దేవదాయ, విద్యుత్ శాఖల సిబ్బందిని సిద్ధం చేశారు. తక్షణ నిర్ణయాల కోసం ఒక మెజిస్ట్రేట్ అధికారిని ఏర్పాటు చేశారు. మరో వైపు బీఎస్‌ఎఫ్ జవాన్లు కూడా ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.

బోల్ భం శంఖారావం

బోల్ భం శంఖారావం