రెండు కొత్త రైళ్ల ఏర్పాటుకు కృషి | - | Sakshi
Sakshi News home page

రెండు కొత్త రైళ్ల ఏర్పాటుకు కృషి

Jul 8 2025 7:06 AM | Updated on Jul 8 2025 7:06 AM

రెండు కొత్త రైళ్ల ఏర్పాటుకు కృషి

రెండు కొత్త రైళ్ల ఏర్పాటుకు కృషి

● కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్‌

కొరాపుట్‌: కొరాపుట్‌ జిల్లాకి కొత్తగా రెండు రైళ్లు వేసేందుకు కృషి చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్‌ హామీ ఇచ్చారు. జయపూర్‌లో మీడియాతో సోమవారం మాట్లాడారు. న్యూఢిల్లీ వెళ్లిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్‌తో సమావేశమై రైళ్ల ఏర్పాటు విషయాన్ని ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. జగదల్‌పూర్‌–భువనేశ్వర్‌, జగదల్‌పూర్‌–సంబల్‌పూర్‌–రౌర్కెలాకు పగటి వేళలో రైళ్లు నడిచేలా ప్రయత్నం చేస్తానన్నారు. తన ప్రాంతం పశ్చిమ ఒడిశా నుంచి కొరాపుట్‌కి పగటి పూట రైళ్లు ఎంతో అవసరం ఉందని ధర్మెంద్ర ప్రదాన్‌ అన్నారు.

సారా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు

జయపురం: అక్రమంగా నాటు సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు జయపురం అబ్కారీ అధికారి శశికాంత దత్త సోమవారం తెలిపారు. అరెస్టయిన వారిలో జయపురం సమితి హరడాపుట్‌ డొంగర వాసి రఘునాథ్‌ హరిజన్‌, కుందారిగుడ గ్రామానికి చెందిన గోపాల్‌ నాగ్‌ ఉన్నట్టు చెప్పారు. కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రఘునాథ్‌ గ్రామం వద్ద తమ సిబ్బంది ఆదివారం సాయంత్రం పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా స్కూటీలో సారాను తరలిస్తున్న ఒకరు పట్టుబడినట్టు చెప్పారు. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌ విధించినట్టు పేర్కొన్నారు. అలాగే పట్టణంలోని ఓ వీధిలో సారాతో గోపాల్‌ నాగ్‌ను అరెస్టు చేశామన్నారు. ఎకై ్సజ్‌ అధికారి శశికాంత దత్త, ఏఎస్సై బలరాం దాస్‌ దాడుల్లో పాల్గొన్నారు.

జగన్నాథునికి పానకం నివేదన

భువనేశ్వర్‌: ఏటా పవిత్ర ఆషాఢ శుక్ల ద్వాదశి సందర్భంగా రథాలపై దేవుళ్లకు పానకం సమర్పిస్తారు. చీకటి పడ్డాక ఈ సేవ నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయాన్ని పాటించారు. ప్రత్యేక మట్టి పాత్రల్లో పానకం నింపుతారు. మూల విరాట్ల పెదవుల ఎత్తు వరకు ఈ పాత్రలు తయారు చేస్తారు. వీటి నిండా సుగంధ ద్రవ్యాలతో రుచికరమైన పానకం పోసి రథాలపై తెరచాటున గోప్యంగా నివేదించడం ఆచారం. ఈ సమగ్ర ప్రక్రియను ఒధొరొ పొణ సేవగా పేర్కొంటారు. రథాలపై ప్రధాన విగ్రహాల ఎదురుగా మట్టి పాత్రల్ని నిలిపి ఒధొరొ పొణ సేవ నిర్వహిస్తారు. స్వామికి పానకం నివేదించడం పూర్తయ్యాక పాత్రలు పగల గొట్టడంతో రథాల పైనుంచి పాణకం పొరలుతుంది. రథాల పైనుంచి పార్శ్వ దేవతల మీదుగా నేలకు ఈ పానకం జారుతుంది. ఇలా జారిన పానకం పార్శ్వ దేవతలు, అశరీర జీవులు సేవించి మోక్షం పొందుతారని విశ్వాసం. పవిత్ర ఆషాఢ శుక్ల ద్వాదశి పురస్కరించుకుని సోమవారం ఈ సేవ జరిగింది.

గాలి వర్షంతో నేలకూలిన చెట్లు

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా బొయిపరిగుడ సమితిలో అత్యధిక వర్షాలతో పాటు పెనుగాలులు వీస్తుండడంతో చెట్లు, ఇళ్లు కూలిపోతున్నాయి. నదులు పొంగుతున్నాయి. ఆదివారం సాయంత్రం బొయిపరిగుడ సమితి టంగిణిగూడ రహదారి, విజయవాడ–రాంచీ 326 జాతీయ మార్గంలో భారీ చెట్లు విరిగిపడడంతో ఇరుపక్కల వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న బొయిపరిగుడ అగ్నిమాపక అధికారి సుకాంత కుమార్‌ ప్రధాన్‌ నేతృత్వంలో అచ్యుత ఓరమ్‌, రాజేష్‌ ప్రధాన్‌, గోవర్దన హిమిక, కులమఱి కిశాన్‌ తదితర సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున చెట్లను తొలగించారు. అలాగే బొయిపరిగుడ పంచాయతీ మాలాగుడ, మాలిగుడ, పూజారిగుడ గ్రామ పంచాయతీ లింబగుడ ప్రాంతాలలో చెట్లు రోడ్లపై పడి రాకపోకలకు అంతరాయం లేకుండా అగ్నిమాపక సిబ్బంది వాటిని రంపాలతో కోసి తొలగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement