
డోలీలే గతి
కొరాపుట్: కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి బోడపు పుట్ గ్రామ పంచాయతీ సునా గుడ గ్రామానికి చెందిన మహిళలు వెదురు కర్రల కోసం అడవిలోకి వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో సబితా పంగి,లక్ష్మీ ఖొర అనే మహిళలు వెనుకబడ్డారు. వీరిద్దరూ కలసి వస్తున్న సమయంలో పులి గాండ్రింపు శబ్ధం వినిపించింది. దాంతో తీవ్ర భయకంపితులయ్యారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దెయ్యం పట్టిందనే అనుమానంతో గిరిజనులు మంత్ర గత్తెలను రప్పించి పూజలు చేశారు. అయినా వారిద్దరి పరిస్థితి పూర్తిగా దిగజారింది. దీంతో వారిద్దరినీ బొయిపరిగుడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నం చేశారు. గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో కుర్చీలను డోలీలుగా మార్చారు. వాగులు, అడవులు, కొండలు దాటి కట్పడ గ్రామానికి చేరుకున్నారు. అక్కడకు కూడా అంబులెన్స్ రాలేదని సిబ్బంది చెప్పడంతో గెండ్ర గుడ వరకు బైక్‌ల మీద తీసుకొని వెళ్లారు. అక్కడ నుంచి అంబులెన్స్ ద్వారా బొయిపరిగుడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భారీ వర్షంలో బాధిత మహిళలను డోలీల మీద తీసుకుని రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధిత గ్రామానికి రోడ్డు వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.