
ప్రాణాలు వదిలి
కాపాడబోయి..
భువనేశ్వర్: కోణార్క్ ప్రాంతంలో సోమవారం దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన పర్యాటకుల్ని రక్షించబోయిన మరో పర్యాటకుడు దుర్మరణం పాలయ్యాడు. పూరీ పర్యటనకు విచ్చేసిన పర్యాటకుల బృందం కోణార్క్ సందర్శన కోసం కారులో బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు కోణార్క్ సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదానికి గురైన కారులో 11 మంది భక్తులు ఉన్నారు. వీరంతా మహారాష్ట్ర, విశాఖపట్నం నుంచి విచ్చేసిన పర్యాటకులుగా గుర్తించారు. ఆదివారం రాత్రి శ్రీ జగన్నాథుని స్వర్ణాలంకార దర్శనం చేసుకుని ఉదయం కోణార్క్ బయల్దేరారు. కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో చంద్రభాగ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ సహా ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించే ప్రయత్నంలో ఒక పర్యాటకుడు విద్యుదాఘాతంతో మరణించాడు. మృతుడు జగత్‌సింగ్‌పూర్ జిలా నువాగాంవ్ గ్రామస్తుడు రంజిత్ పొఢియారిగా గుర్తించారు. ప్రమాదంలో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులతో కలిసి కోణార్క్ పర్యటనకు వచ్చిన రంజిత్ పొఢియారి ప్రయత్నించాడు. సహాయం చేసేందుకు రంగంలో దిగిన రంజిత్‌కు దురదృష్టవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో సొమ్మసిల్లి పోయాడు. సత్వర చికిత్స కోసం అందుబాటులో ఉన్న ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషాద సంఘటన సమాచారం అందడంతో అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న పర్యాటకులందరినీ రక్షించి చికిత్స కోసం కోణార్క్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. ప్రథమ చికిత్స తర్వాత ఉన్నత చికిత్స కోసం బాధితుల్ని భువనేశ్వర్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కోణార్క్ ఠాణా పోలీసులు ఘటనా స్థలం సందర్శించి దుర్ఘటన పాలైన టవేరా కారును స్వాధీనం చేసుకుని సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.