
రహదారి సౌకర్యం కల్పించండి
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధి గడ్డి శశిఖాల్ పంచాయతీ మోండొలోపితేసు గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వర్షాకాలం కావడంతో గ్రామానికి ఉన్నటువంటి మట్టిరోడ్డుపై కనీసం నడిచే అవకాశం కూడా లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
హనుమాన్ చాలీసా పుస్తకాలు పంపిణీ
రాయగడ: సదరు సమితి దిసారిగుడ గ్రామంలో ఆధ్యాత్మికంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు హనుమాన్ చాలీసా పుస్తకాలను శనివారం పంపిణీ చేశారు. ఆధ్యాత్మికురాలు జయంతి సెఠి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. మన సనాతన ధర్మాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు తెలుసుకునేవిధంగా తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పారు. అదేవిధంగా గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు గొడుగులను కూడా పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు సత్య మెలక తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుపై చేపలు పడుతూ నిరసన
మల్కన్‌గిరి: దారి అధ్వానంగా ఉందని చెప్పినా ఏమీ చేయకపోవడంతో ఆ గ్రామస్తులు రోడ్డుపై చేపలు పట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. నగరంలో 19 వ వార్డులో గల రిక్లమేషన్ చౌక్ నుంచి ఎంవీ 43 గ్రామం వరకు దాదాపు 3 కిలోమీటర్ల దారి పూర్తిగా ధ్వంసమైపోయింది. రహదారి మధ్యలో 2 నుంచి 3 అడుగుల లోతైన గుంతలు పడి ఉండడంతో స్థానికులు శనివారం అందులో చేపలు పట్టి నిరసన తెలిపారు.
ఆహార పానీయాలు పంపిణీ
భువనేశ్వర్: సుదూర ప్రాంతాల నుంచి శ్రీ జగన్నాథుని రథ యాత్ర సందర్శనకు విచ్చేసే రైలు ప్రయాణికుల కోసం ఖుర్దారోడ్ రైల్వే స్టేషన్‌లో ఉచిత ఆహార పానీయ వితరణ కేంద్రం నిర్వహించారు. స్థానిక బాలాజీ మందిరం కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. రథ యాత్రను పురస్కరించుకుని రైల్వే శాఖ పూరీ ప్రాంతానికి ప్రత్యేక రైళ్లు నడిపించడంతో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛందంగా సేవలను అందిస్తున్నారు.
పాముకాటుకు చిన్నారి మృతి
కంచిలి: మకరాంపురం గ్రామానికి చెందిన గుడియా సాయిసా(10) అనే చిన్నారి పాము కాటుకు గురై మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. గుడియా పూర్ణచంద్ర–గీత దంపతుల కుమార్తె సాయిసా కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసింది. చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బరంపురం ఎం.కె.సి.జి. ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. సాయిసా స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తండ్రి పూర్ణచంద్ర టిఫిన్ హోటల్‌లో హెల్పర్‌గా, తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చిన్నారి సాయిసాతోపాటు కుమారుడు ఉన్నాడు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
జాతీయ కబడ్డీ పోటీలకు సిక్కోలు క్రీడాకారులు
శ్రీకాకుళం న్యూకాలనీ: మొదటి జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్–2025 పోటీలకు జిల్లాకు చెందిన సత్తారు రామ్మోహనరావు, పోతనపల్లి యమున ఎంపికయ్యారు. ఈ పోటీలు జూన్ 29 నుంచి జూలై ఒకటో తేదీ వరకు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వేదికగా జరగనున్నాయి. ఇప్పటికే వీరు ఏపీ జట్లతో కలిసి హరిద్వార్ చేరుకున్నారు.

రహదారి సౌకర్యం కల్పించండి

రహదారి సౌకర్యం కల్పించండి

రహదారి సౌకర్యం కల్పించండి