
ఉపాధి వేతనదారు మృతి
టెక్కలి రూరల్: మండలంలోని రావివలస గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు అనపాన పార్వతి(45) గురువారం మృతిచెందింది. గ్రామ సమీపంలో ఉపాధి పని చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తోటి కూలీలు వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహిస్తుండగా మృతిచెందింది. వడదెబ్బ తగలడం వల్లే మృతిచెంది ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పార్వతికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి గాయాలు
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ గ్రామం వద్ద అలికాం–బత్తిలి రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్లెమ్మ గ్రామానికి చెందిన బొడ్డు నానాజి, తన భార్యతో కలిసి భామిని నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఎదురుగా బైక్‌పై వస్తున్న యువకుడు ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులు, యువకుడు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక సీహెచ్‌సీలో చేర్పించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ బి.గోవిందరావు తెలిపారు.
గొర్రెలు, మేకల పెంపకందారుల
సహకార సంఘం చైర్మన్‌గా తాతయ్య
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం జిల్లా చైర్మన్‌గా కుజ్జ తాతయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఈడీ డాక్టర్ బి.యోగేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం నగరంలో పశుసంవర్థకశాఖ కార్యాలయంలో ఎన్నికల అధికారి డాక్టర్ పి.రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ ఎన్నికలో సంఘం ఉపాధ్యక్షులుగా పల్ల నరహరితో పాటు 11మంది సభ్యుల్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జేడీ బి.రాజ్‌గోపాల్, పర్సన్ ఇన్‌చార్జి డాక్టర్ టి.పి.మనోజ్‌కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా, సంఘంలో 123 మంది ఓటర్లు ఉన్నప్పటికీ నామమాత్రంగా హాజరై ఎన్నిక మమా అనిపించేశారు. మంత్రి సిఫార్సు చేసిన వారికే చైర్మన్, ఉపాధ్యక్ష పదవుల్ని కట్టబెట్టారని పలువురు సంఘ నాయకులు ఆరోపించడం గమనార్హం.
ఆదిత్యుని సన్నిధిలో సినీ గాయకులు శ్రీకృష్ణ, యామిని
అరసవల్లి: సూర్యనారాయణ స్వామిని ప్రముఖ సినీ గాయకులు శ్రీకృష్ణ, యామినిలు గురువారం దర్శించుకున్నారు. తొలిసారిగా ఆదిత్యున్ని దర్శించుకోవడం నిజంగా తమ అదృష్టమని వారు తెలియజేశారు. వీరికి ఆలయ అధికార వర్గాలు సంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ మేనేజ్‌మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు సంబంధించిన తాత్కాలిక సీనియారిటీ జాబితా డీఈఓ అధికారిక వెబ్‌సైట్‌లో సిద్ధంగా ఉందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కార్యాలయ పనివేళల్లో తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు సంబంధించి తాత్కాలిక సీనియారిటీ జాబితాపై ఆర్జేడీ కార్యాలయంలో అభ్యంతరాలను ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తగిన ఆధారాలతో సమర్పించాలని డీఈఓ పేర్కొన్నారు.

ఉపాధి వేతనదారు మృతి

ఉపాధి వేతనదారు మృతి

ఉపాధి వేతనదారు మృతి