శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అధికారుల నిఘా నడుమ కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పిలి మోడల్ స్కూల్ కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాల్లో జరిగిన మ్యాథ్స్ పరీక్షకు రెగ్యులర్, న్రైవేటు కలిపి 28,584మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 28,384 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 199 మంది గైర్హాజరయ్యారు. సోమవారం మ్యాథ్స్ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని డీఈఓ స్పష్టం చేశారు. జిల్లా పరిశీలకులు మస్తానయ్య కుప్పిలి మోడల్ స్కూల్ ఏ, బీ కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏర్పాట్లు, సౌకర్యాలతో పాటు పరీక్షలు జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. డీఈవో డాక్టర్ తిరుమలచైతన్య జలుమూరు, సారవకోట మండల పరిధిలో ని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కుప్పిలిలో ప్రశాంతం
ఎచ్చెర్ల క్యాంపస్: కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో సోమవారం 10వ తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. గణితం పరీక్షను రాష్ట్ర పరిశీలకులు, మస్తానయ్య, మండల విద్యా శాఖ అధికారి కె.పున్నయ్య పరీక్ష పరిశీలించారు. ఏ, బీ పరీక్ష కేంద్రాల్లో 9 గదుల్లో 425 మంది పరీక్ష రాస్తున్నారు. పరీక్ష నిర్వహణ విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, కస్టోడియన్ కం సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు 21 మందిని మార్పు చేశారు.
ిసట్టింగ్ స్క్వాడ్‌గా వ్యవహరించిన డీఈఓ
సారవకోట: మండలంలోని బుడితి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన 10వ తరగతి లెక్కలు పరీక్షకు సిట్టింగ్ స్క్వాడ్‌గా డీఈఓ తిరుమల చైతన్య వ్యవహరించారు. ఇక్కడ పరీక్షలు జరుగుతున్న విధానంపై అనుమానం రావడంతో పాటు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన పరీక్ష కేంద్రాన్ని తొలుత పరిశీలించి అనంతరం పరీక్ష ముగిసే వరకు అక్కడే ఉన్నారు. 10వ తరగతి పరీక్షలలో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.