జయపురం: జయపురం సతిగుడ కెనాల్ ఎల్లో డేమ్ వద్ద కెనాల్‌లో పడిన కుమారుడి ఆఖరి చూపు అయినాదక్కాలని తండ్రి మూడు రోజులుగా ఎదురు చూస్తున్నారు. జయపురం మహారాణిపేట్ రాందాస్ లైన్ నివాసి పి.గౌరీశంకర్ చిన్న కుమారుడు పి.నిఖిలేష్(17) సతిగుడ నది ఎల్లో డేమ్ సమీపంలో గల కెనాల్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. తండ్రి గౌరీశంకర్ తన కుమారుడు కెనాల్‌లో పడి కనిపించలేదని పోలీసులకు, అగ్నిమాపక విభానికి తెలియజేశారు. కెనాల్ వద్ద నిఖిలేష్ వస్తువులు ఉన్నాయి. వారు వచ్చి ఎంత గాలించినా ఏమీ దొరకలేదు. నిఖిలేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి గానీ, ఉపాధ్యాయులు గానీ నమ్మడం లేదు. కుమారుడి మృతదేహమైనా దొరుకుతుదని తండ్రి గౌరీశంకర కెనాల్ వద్ద ఆశగా ఎదురు చూడటం కనిపించింది. నిఖిలేష్ గత ఏడాది పరీక్షలో 95 శాతం మార్కులు తెచ్చుకున్నాడు. గౌరీశంకర్ భార్య కొద్ది రోజుల కిందట మృతి చెందారు. ఇప్పుడు చిన్నకొడుకు కాలువలో గల్లంతైపోయాడు. ఆఖరి చూపైనా దక్కాలని కళ్లు కాయలు కాసేలా తండ్రి ఎదురు చూస్తున్నాడు.