ఇచ్ఛాపురం టౌన్: వైకల్య ధ్రువపత్రాల పరిశీలన కోసం ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి గురువారం వచ్చిన దివ్యాంగులకు అధికారుల తీరు కారణంగా ఇబ్బందులు తప్పలేదు. కంచిలి మండలం బెల్లుప డ గ్రామానికి చెందిన దివ్యాంగులు బి.సీతమ్మ, సీహెచ్ పాపారావు, కె.హరికృష్ణ, సీహెచ్ లత, నర్తు గీతలు అంగవైకల్య ధ్రువపత్రం కోసం దరకాస్తు చేసుకున్నారు. వైద్య పరిశీలనకు గురువారం ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి హాజరుకావాలని నమోదుపత్రంలో సమయం కేటాయించారు. తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి దివ్యాంగులు రాగా.. పరిశీలకులు రాలేదని సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయం అధికారులు ముందుగా చెప్పకపోవడంతో సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఆటోలో రావాల్సి వచ్చిందని వాపోయారు. కా గా, దివ్యాంగులకు బుధవారం మాత్రమే వైద్య పరిశీలన చేస్తారని వైద్యాధికారి దేవేంద్రరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ముందుగానే ఆయా మండల అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు.