భువనేశ్వర్: తూర్పుకోస్తా రైల్వేశ్రామిక్ కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ముగిసింది. భారతీ య రైల్వే కార్మిక జాతీయ సమాఖ్య(ఎన్‌ఎఫ్‌ఐఆర్) పిలుపుమేరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఖుర్దారోడ్ మండల సమ న్వయకర్త సునీల్ కుమార్ భంజ్ ఆధ్వర్యంలో మండల రైల్వే అధికారి డీఆర్‌ఎం కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేసి ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శాంతియుతంగా నిరసన కొనసాగించిన సంగతి తెలిసిందే. పాత ఫించను వ్యవస్థ పునరుద్ధరణ డిమాండుతో రైల్వే కార్మికుల వివిధ ప్రాథమిక హక్కులపై దేశ వ్యాప్తంగా భారతీయ రైల్వేలోని అన్ని జోన్లు, మండలాల్లో నిర్వహించిన ఆందోళన బుధవారంతో ముగిసింది. ముగింపు సభలో తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు పాల్గొని కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. లోకో పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డులు) వెతలు, వాణిజ్య విభాగం అధికారుల అహంకారం, ఆపరేటింగ్, సిగ్నల్, ఇంజినీరింగ్ విభాగాల్లో సిబ్బంది అణచివేతను తప్పుపట్టారు. అనంతరం సునీల్ కుమార్ భంజ్ ఆధ్వర్యంలో కార్యకర్తల ప్రతినిధి బృందం ఖుర్దారోడ్ మండల రైల్వే అధికారి హెచ్.ఎస్.బాజ్వాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నిరంజన్ మిశ్రా, మీడియా ఇన్‌చార్జి లక్ష్మీధర మహంతి తదితరులు పాల్గొన్నారు.