కొరాపుట్: ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం నబరంగ్‌పూర్ జిల్లా రాయిఘర్ నుంచి ఒడి10ఎక్స్ 4057 నెంబర్ గల ఎస్‌వీటీ ట్రావెల్స్ ప్రయివేట్ బస్సు జయపూర్ వైపు వెళ్తుండగా తారాగాం వద్ద జాతీయ రహదారిపై టైర్ పేలడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో డాబుగాంకు చెందిన గోవింద త్రిపాఠి (40) బస్సులోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పపడాహండి, నబరంగ్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్ర గాయాలపాలైన 15 మందిని నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. క్షతగాత్రులను నబరంగ్‌పూర్ మాజీ ఎమ్మెల్యే సదాశివ ప్రధాని, జెడ్పీ సభ్యుడు అరుణ్ మిశ్రా, ప్రమోద్ రథ్‌లు పరామర్శించారు. అగ్నిమాపక బృందాలు రోడ్డును క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు.
ప్రైవేటు బస్సు బోల్తా
ప్రైవేటు బస్సు బోల్తా