భువనేశ్వర్: ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన శనివారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో 11 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటిలో బలహీన వర్గాల ప్రజల కోసం అంత్యోదయ గృహ పథకం ప్రధానమైనది. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల ప్రోత్సాహానికి మండల స్థాయిలో స్టేడియంల నిర్మాణం, ఏకీకృత పింఛన్ పథకం తదితర ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది.
అంత్యోదయ గృహ యోజన
సమాజంలోని బలహీన వర్గాలకు గృహాలను అందించడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అంత్యోదయ గృహ యోజన ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ పథకం కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలలో 2,25,000 ఇళ్లను బీదలకు అందిస్తుంది.
అర్హులకు పక్కా ఇల్లు
ఈ పథకం కింద ప్రకృతి లేదా మానవ కృత్య విపత్తుల వల్ల ప్రభావితమైన కుటుంబాలు, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులైన కుటుంబాలు, వికలాంగులను ప్రధాన ఆర్జకులుగా ఉన్న కుటుంబాలు, అటవీ హక్కుల చట్టం లబ్ధిదారులు, ప్రస్తుత గృహ పథకం నుంచి ప్రయోజనం పొందని అర్హులైన కుటుంబాలకు పక్కా ఇల్లు అందిస్తారు. లబ్ధిదారుడు 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 1 లక్ష 20 వేలు ఆర్థిక సహాయం అందజేస్తారు. 3 ఏళ్ల లోపు ఈ పథకం కింద 2,25,000 కొత్త పక్కా గృహాలు మంజూరు కానున్నాయి. ఈ పథకానికి ప్రభుత్వం రూ.7,550 కోట్లు ఖర్చు చేస్తుంది.
బోనస్ ప్రోత్సాహం
అంతోదయ గృహ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ), ప్రధాన మంత్రి జనజాత్ ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ (పీఎం – జన్‌మన్), ఇతర ప్రభుత్వ గ్రామీణ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం పనిని 4 నెలల్లో పూర్తి చేస్తే 20,000 రూపాయలు, 6 నెలల్లో పూర్తి చేస్తే 10,000 రూపాయలు బోనస్ అందుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో స్టేడియంలు
క్రీడా మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 314 మండలాల్లో మండల స్థాయి స్టేడియాలను నిర్మిస్తారు. దీని కోసం ప్రతిపాదించిన పథకం ఆమోదం పొందడంతో గ్రామీణ ప్రాంతాల్లో 12 నుంచి 15 ఎకరాల స్థలంలో స్థలంలో స్టేడియాల నిర్మాణం చేపడతారు. ఈ స్టేడియంలో ఫుట్‌బాల్, క్రికెట్, అథ్లెటిక్స్, ఇతర క్రీడలకు సౌకర్యాలు ఉంటాయి. రాబోయే ఐదేళ్లలో ఈ పథకం వ్యయ ప్రణాళిక రూ. 4,124 కోట్లకు మంత్రి మండలి ఆమోదించడం విశేషం.
ఏకీకృత పింఛన్
రాష్ట్రంలో ఏకీకృత ఫించను పథకాన్ని అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఎన్‌పీఎస్ లోని అధికారులు ఈ విధానం కింద పింఛన్ పొందుతారు. ఈ పథకం పరిధిలో సమగ్రంగా 3,33,000 మంది అధికారులు ఉన్నారు. వీరి అభీష్టం మేరకు ఎన్‌పీఎస్ లేదా యూపీఎస్ వ్యవస్థలో కొనసాగేందుకు మంత్రి మండలి వెసులుబాటు కల్పించింది.
రాష్ట్రంలోని ఆనకట్టల మరమ్మతు, మెరుగుదల కోసం ప్రతిపాదించిన రూ. 66,000 కోట్లు వ్యయ ప్రణాళికకు మంత్రి మండలి ఆమోదించింది. ఈ ఆమోదం మేరకు హిరాకుడ్ ఆనకట్ట మరమ్మతు, మెరుగుదలకు 3 ప్రాజెక్టులు చేపడతారు. ఈ ప్రాజెక్టుల పన్నులు రానున్న 6 సంవత్సరాలలో పూర్తవుతాయని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. రాష్ట్రంలోని సబార్డినేట్ జ్యుడీషియరీలో నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, అన్ని వర్గాల అభ్యర్థులకు నియామక అవకాశాలను కల్పించడానికి జ్యుడీషియల్ స్టాఫ్ సర్వీసెస్ (నియామక పద్ధతులు మరియు సేవా నిబంధనలు) – 2008ని సవరించడానికి చర్యలు తీసుకుంటారు.
చాంద్‌బలి భారిపొడా ఖరస్రోత నదిపై ఉన్న పాత వంతెన దగ్గర అలీ, చాంద్‌బలిలను అనుసంధానపరిచే వంతెనను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ కేంద్రాపడాను భద్రక్‌తో కలిపే 9వ నంబరు జాతీయ రహదారి ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. కేంద్రాపడా జిల్లాలోని కటక్ – చాంద్‌బాలి రహదారిపై బ్రాహ్మణి నదిపై రెండవ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. అదేవిధంగా ఝార్సుగుడ జిల్లా పూజారిపల్లి ఘాట్ వద్ద వంతెన నిర్మించడం ద్వారా ఝార్సుగుడ జిల్లాను బర్‌గఢ్ జిల్లాలోని జొరిముల్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు.
బీదల కోసం అంత్యోదయ
గృహ యోజన
ప్రతి మండలంలో స్టేడియంలు
ఏకీకృత పింఛన్ పథకం
Comments
Please login to add a commentAdd a comment