
‘కళా’కు కోడ్ వర్తించదా..!
● అమ్మవారి జాతర కరపత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్యే వెంకటరావు
చీపురుపల్లి:
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వం తరఫున జరిగే ఎలాంటి కార్యక్రమాల్లోనూ, ప్రారంభోత్సవాల్లోనూ ప్రజాప్రతినిధులు పాల్గొనరాదని కోడ్ నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో సీనియారిటీ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కోడ్ ఉల్లంఘించారనే చర్చ పట్టణంలో జరుగుతోంది. శనివారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తేదీలు వెల్లడిస్తూ, కరపత్రాలు విడుదల చేయడం కోడ్ ఉల్లంఘనలోకి వస్తుందని రాజకీయ పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వమే జాతర నిర్వహిస్తుందని సాక్షాత్తూ ఎమ్మెల్యే వెల్లడించడం కోడ్ ఉల్లంఘనే కదా? అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలని పలువురు చర్చించుకుంటున్నారు. కోడ్ అమల్లో ఉండడంతోనే కరపత్రాలు విడుదలకు దేవదాయశాఖ అధికారులు కూడా హాజరవ్వలేదని తెలుస్తోంది. కోడ్ అమల్లో ఉండడంతోనే జాతరకు ఉత్సవ కమిటీను కూడా నియమించలేదు. కరపత్రాలు విడుదల సమయంలో దేవదాయశాఖ అధికారులు లేకపోవడాన్ని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈఓ బి.శ్రీనివాస్ వద్ద ప్రస్తావించగా కోడ్ అమల్లో ఉండడంతోనే హాజరవ్వలేకపోయానని తెలిపారు.
జాతర తేదీలు వెల్లడించిన ఎమ్మెల్యే
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరను మార్చి 2, 3, 4 తేదీల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు వెల్లడించారు. శనివారం ఆయన క్యాంప్ కార్యాలయంలో అమ్మవారి జాతర కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఏటా జరుగుతున్న సాంప్రదాయంలో భాగంగానే ఈ ఏడాది కూడా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి 27వ వార్షిక జాతర మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. దేవదాయశాఖ, గ్రామ పెద్దలు, భక్తులు నేతృత్వంలో ప్రభుత్వం జాతరను నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. మూడు రోజులు జాతరలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు, గవిడి నాగరాజు, పైల బలరాం, రెడ్డి గోవింద్, సారేపాక సురేష్, పొట్నూరు త్రినాధరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment