ట్రస్ట్ బోర్డు సమావేశంలో నిర్ణయం సమావేశంలో ‘సాక్షి’ ప్రచురించిన ‘నత్తేనయం’ కథనంపై చర్చ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దుర్గమ్మ సన్నిధిలోని నూతనంగా నిర్మించిన అన్నదానం, ప్రసాదాల పోటులను జూన్ నెల నుంచి వినియోగించాలని ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ నిర్ణయించారు. దుర్గగుడిలో చేపట్టిన అభివృద్ధి పనుల తీరుపై ‘సాక్షి’ ఈ నెల 14న ‘నత్తేనయం’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల ఆలస్యం, భక్తుల ఇబ్బందులను ఈ కథనం కళ్లకు కట్టినట్లు వివరించింది. శనివారం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం జరగగా ఆలయ చైర్మన్, ఈవో ఈ కథనంలో వెల్లడించిన దుర్గగుడి అభివృద్ధి పనులపైనే ప్రధానంగా చర్చించారు. గత ఏడాది దసరా ఉత్సవాలు, భవానీ దీక్ష విరమణల సమయంలోనే అన్నదానం, లడ్డూపోటు భవనాల పనులు తుది దశకు చేరుకొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటి వరకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని ఆలయ అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం అన్నదాన భవనంలో వెలుపల తుది పనులు జరుగుతున్నాయని, మరో పక్షం రోజుల్లో పూర్తి చేస్తామని ఈవో పేర్కొన్నారు. మరో వైపున జూలై 15 నుంచి ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభం కానుండటంతో అప్పటిలోగా అన్నదానాన్ని నూతన భవనంలోకి తరలించేలా చూడాలని సూచించారు.
సారె సమర్పించిన
ప్రతి భక్తుడికి అన్న ప్రసాదం
ప్రస్తుతం మహా మండపం రెండో అంతస్తులో రోజూ సుమారు 5 వేల మందికి అన్న ప్రసాదం పంపిణీ చేస్తుండగా, నూతన అన్నదాన భవనంలో పది వేల మందికి అందించేలా నిర్మాణం జరిగింది. సారె సమర్పించిన ప్రతి ఒక్కరికీ అన్న ప్రసాదం అందాలంటే నూతన భవనంలోనే సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. మరో వైపున లడ్డూ పోటు దాదాపు పూర్తి కాగా ఆ భవనంలో కూడా లడ్డూ తయారీకి అవసరమైన గ్యాస్ పొయ్యిలు, ఇతర మిషనరీని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఉత్సవాల సమయంలో లడ్డూలను కనకదుర్గానగర్‌లోని ప్రసాదాల కౌంటర్‌లోకి తరలించడం పెద్ద సమస్యవుతోంది. కొత్త భవనం అందుబాటులోకి వస్తే ఆసమస్య పరిష్కరం కానుంది.
అర్జున వీధిలో దేవస్థాన కాటేజీ
ప్రతిపాదనలు సిద్ధం
దుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం అర్జున వీధిలో నూతన కాటేజీ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని రాధాకృష్ణ పేర్కొన్నారు. కనకదుర్గనగర్, అర్జున వీధిల్లో ఉన్న షెడ్డుతో పాటు పక్కనే ఉన్న ప్రయివేటు స్థలాన్ని తీసుకుని దేవస్థానం నూతన కాటేజీలను నిర్మించాలని ప్రతిపాదనలు చేసిందన్నారు. రెండో ఘాట్ రోడ్డు పనులు కూడ త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. దుర్గమ్మకు చెందిన ఆస్తులు, పొలాలు, భూములను రక్షించేందుకు ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిపి ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ట్రస్ట్ బోర్డులో మొత్తం 25 అంశాలు చర్చకు వచ్చాయి.


