చంద్రబాబు పాలనలో అన్నదాత అధోగతి | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో అన్నదాత అధోగతి

Apr 5 2026 9:24 AM | Updated on Apr 5 2026 9:24 AM

చంద్రబాబు పాలనలో అన్నదాత అధోగతి

రైతులను ఆదుకోకుంటే కలెక్టరేట్‌ ముట్టడిస్తాం వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ హెచ్చరిక దళారుల చేతిలో నుంచి రైతులను కాపాడాలని డిమాండ్‌

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో అన్నదాతలు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని, రైతులను ఆదుకోకుంటే కలెక్టరేట్‌ ముట్టడిస్తామని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ హెచ్చరించారు. సింగ్‌నగర్‌ ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అవినాష్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు లేక, పాసుపుస్తకాలు లేక రైతులు దళారుల చేతిలో, పాలకుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు. గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉండేవారని, నేడు కనీసం రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ కేవలం తమ వాటాల కోసమే ఆరాటపడుతున్నారని, ప్రతి పనికీ మాకేంటని కమీషన్ల కోసం ఎమ్మెల్యేలే నేరుగా అడుగు తున్నారని, అదేమని అడిగితే తమ వెనుక మంత్రి నారా లోకేష్‌ ఉన్నాడని ఎంపీ బహిరంగం గానే చెబుతూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, రేషన్‌ బియ్యం, ఇసుక, మట్టి మాఫియా, ల్యాండ్‌ మాఫియా ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. రైతుల పక్షాన వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని, తక్షణమే రైతులు, ప్రజల సమస్యలను పరిష్క రించాలని, లేనిపక్షంలో కలెక్టరేట్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు.

జిల్లాలోనే 20 మంది రైతులు ఆత్మహత్య

: మల్లాది విష్ణు

వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ప్రభుత్వం పాలనలో రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని, ఒక్క ఎన్టీఆర్‌ జిల్లాలోనే 20 మంది వరకూ రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్సార్‌సీపీ సెంట్రల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, ముఖ్యంగా మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. పాస్‌ పుస్తకాల కోసం రైతులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగినా పాస్‌ పుస్తకాలు ఇచ్చే నాథుడే లేడని, అసలు ఇప్పటివరకు ఎంతమందికి పాస్‌ పుస్తకాలు ఇచ్చారో, ఇంకా ఎంతమందికి ఇవ్వాలో, వారందరికీ ఎప్పుడు ఇస్తారో కూటమి ప్రభుత్వం, కలెక్టర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, నందిగామ ప్రాంతాల్లో ఇసుక, మట్టి మాఫియా రెచ్చిపోతోందని వందల ట్రిప్పుల ఇసుక తెలంగాణకు తరలిపోతున్నా మైనింగ్‌ అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. పీడీఎస్‌ బియ్యం మాఫియా జరుగుతోందని, బియ్యం రాష్ట్రాలు దాటిపోతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవాలయ భూములకు రక్షణ లేదని. గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారని వైఎస్సార్‌ సీపీ పోరాటం వల్లే ఆ భూములను కాపాడగలిగామని అన్నారు.

ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం దారుణం

: వెలంపల్లి

చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అటకెక్కించి, పేదలకు వైద్యం అందకుండా నిర్వీర్యం చేసిందని వైఎస్సార్‌ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ చార్జ్‌, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఏప్రిల్‌ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం దారుణమని, రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీని పునరుద్ధరించి పేదలకు అండగా నిలవాలని డిమాండ్‌ చేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అనేది కేవలం టీడీపీ కార్యకర్తలకే పరిమితం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. జిల్లాలో కూటమి నేతలు సాగిస్తున్న అక్రమాలను, దౌర్జన్యాలను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని, ప్రజల పక్షాన నిలబడి అక్రమాల్ని ఎండగడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement