రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

Apr 4 2026 9:49 AM | Updated on Apr 4 2026 9:49 AM

నందిగామ టౌన్‌: హోం శాఖ మంత్రిగా మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో మహిళలకు ఇంటా, బయటా రక్షణ కరువైందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వంగలపూడి అనిత సారథ్యంలోని హోంశాఖ లా అండ్‌ ఆర్డర్‌ కాస్త లేట్‌ అండ్‌ ఆర్డర్‌గా నడుస్తోందని ఎద్దేవాచేశారు. మహిళలపై ఇప్పటి వరకు జరిగిన అఘాయిత్యాలు, దాడులు, లైంగికదాడి ఘటనల్లో న్యాయం జరిగిందా? తప్పు చేసిన వారికి శిక్ష పడిందా అని ప్రశ్నించారు. రెండేళ్లుగా మహిళలకు అన్యాయాన్ని చూస్తుంటే హోం మంత్రికి ఎలా ఉందో తెలియదు కానీ తాము మాత్రం సిగ్గు పడుతున్నామని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో మహిళపై జరిగిన దాడి అత్యంత బాధాకరమన్నారు. ప్రతిపక్షంలో ఉండగా మహిళా రక్షణ కోసం గగ్గోలు పెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు

తమ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లు వైఎస్సార్‌ సీపీ ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని శ్యామల స్పష్టంచేశారు. కేవలం ప్రాంతం పేరు చెప్పుకొని చేసే దోపిడీకి మాత్రమే వ్యతిరేకమన్నారు. రాజధానికి చట్టబద్దత అంటూ నానా హంగామా చేస్తున్నారని దీపాలు వెలిగిస్తున్నారని, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ఇళ్లలో కూడా ఇలానే ఆనందంగా సంబరాలు చేసుకుని దీపాలు వెలిగిస్తున్నారా అని ప్రశ్నించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు నానా అవస్థలు పడుతున్నారని, ప్లాట్లు అంటూ పట్టాలిచ్చారని, అవి ఎక్కడో భూమిపై చూపించలేని అసమర్థ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రాజధాని రైతుల భూ సమస్యను పరిష్కరించాలని హితవుపలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహనరావు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రతిపాదన రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమన్నారు. దీని ద్వారా రాజధాని నిర్మాణానికి ఖర్చు తగ్గటంతో అతి కొద్ది సమయంలోనే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం శ్యామల దంపతులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహనరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీరులపాడు ఎంపీపీ కోటేరు లక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్‌లు కోటేరు నాగమల్లేశ్వరి, మార్త రజని, నాయకులు వేమా రోజ, షేక్‌ ఫాతిమ, వైఎస్‌ఎన్‌ ప్రసాద్‌, వేమా సురేష్‌బాబు, బుగ్గినేని సురేష్‌, కోటేరు సూర్య నారాయణ రెడ్డి, వేమూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి శ్యామల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement