● వేసవిలో మాడిపోతున్న వేప చెట్లు
● గ్రామీణుల్లో అపోహలతో
కూడిన ఆందోళన
● డై బ్యాక్ తెగులేనంటున్న నిపుణులు
నాగాయలంక: భారతీయ ఆయుర్వేద వైద్యంలో సర్వరోగ నివారిణిగా, ఔషధ వృక్షంగా భావించే వేప చెట్లు రోగాల బారిన పడి చనిపోడంపై గ్రామీణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పలు ప్రాంతాల్లో వేప చెట్లు ఎండిపోతూ కనిపిస్తున్నాయి. తొలుత వేసవి కాలం కారణంగా ఆకులు ఎండి రాలిపోయి మళ్ళీ చిగురిస్తాయని తేలికగా తీసుకున్న ప్రజల్లో రాను రాను అధిక సంఖ్యలో వేప చెట్లు ఎండి చనిపోవడంతో ఆందోళన నెలకొంది. మూడేళ్ళ క్రితం 2023 ఏప్రియల్ మాసంలో కూడా ఇదే రీతిలో చెట్లు భారీ సంఖ్యలో మాడిపోయాయి. మళ్లీ ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో వేసవి తాపాన్ని తీర్చి చల్లని వాతావరణం ఇచ్చే వేప చెట్లు ఎండిపోవడంపై ఉద్యానవన, అటవీశాఖ అధికారులు అధ్యయనం చేసి అపోహలు తొలగించాలని గ్రామీణులు కోరుతున్నారు.
డై బ్యాక్ తెగుల్ల వల్లే..
వేపచెట్టు కొమ్మలు పై నుంచి ఎండుతూ కింది వరకు వచ్చే పరిణామాలను డైబ్యాక్ తెగులుగా ఉద్యానవన నిపుణులు చెపుతున్నారు. ఈ తెగులు తీవ్రత అధికమైనప్పుడు చెట్లు చనిపోయే అవకాశం ఉందంటున్నారు. దీని నివారణకు మూడు గ్రాముల బ్‌లైటెక్స్ మందును లీటరు నీటితో కలిపి చెట్టు చుట్టూ వేర్లు తడిచేలా పోస్తే నివారణకు అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.


