నవదిన ప్రార్థనలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నవదిన ప్రార్థనలు ప్రారంభం

Feb 1 2026 7:26 AM | Updated on Feb 1 2026 7:26 AM

నవదిన ప్రార్థనలు ప్రారంభం

నవదిన ప్రార్థనలు ప్రారంభం

గుణదల(విజయవాడ తూర్పు): భారత దేశంలో రెండవ అతిపెద్ద కతోలిక క్రైస్తవ పుణ్యక్షేత్రంగా ఘనతకెక్కిన గుణదల మేరీమాత ఆలయంలో 102వ మహోత్సవాల నవదిన ప్రార్థనలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కతోలిక పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్‌ రాజారావు, మోన్సిగ్నోర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌, పుణ్యక్షేత్ర రెక్టర్‌ ఫాదర్‌లు ప్రధానాలయం వద్ద మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిషప్‌ రాజారావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ఎంతో ప్రసిద్ధి గాంచిందన్నారు. కోరిన కోర్కెలు తీర్చుతూ మరియ తల్లి భక్తుల పాలిట కల్పవల్లిగా వెలుగొందుతోందన్నారు. ఈ యేడాది ఫిబ్రవరి 8,9,10 తేదీలలో గుణదల మాత ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు లక్షలాదిగా తరలివచ్చి మరియతల్లి దీవెనలు పొందాలని కాంక్షించారు. అనంతరం మోన్సిగ్నోర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ యేడాది జరిగే ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. దేవాలయం దిగువన ఏర్పాటు చేసే ప్రత్యేక వేదికపై సమష్టి దివ్యబలి పూజలు, దేవుని వాక్య సందేశాలు జరుగుతాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ తిరునాళ్లను విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం పలు విచారణల నుంచి వచ్చిన భక్తులు కొవ్వొత్తులు చేతపట్టి జపమాలతో కాలినడకన కొండ పైన మరియమాత విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద జరిగిన సమష్టి దివ్యబలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వికార్‌ జనరల్‌ ఎం. గాబ్రియేలు, ఎడ్యుకేషన్‌ డెస్క్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ కె.మరియన్న, సోషల్‌ సర్వీస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ టి.సునీల్‌ రాజు, ఫాదర్‌ కిరణ్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement