ప్రమాద రహిత ఉత్తమ డ్రైవర్లకు పురస్కారాలు
బస్టాండ్(విజయవాడ పశ్చిమ): ప్రజా రవాణాసంస్థ ( ఏపీఎస్ ఆర్టీసీ)లో డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చి ప్రమాద రహిత ఉత్తమ డ్రైవర్లుగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని అధికారులు సత్కరించి పురస్కారాలు అందజేశారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఆవరణలోని విజయవాడ డిపోలో నిర్వహించిన కార్యక్రమంలో డీసీపీ షేక్ షిరీన్ బేగం, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోన్–2 జి.విజయరత్నం ఉత్తమ డ్రైవర్లను సత్కరించి నగదు, ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేళ్లుగా దేశంలోనే ఆర్టీసీ ప్రమాదాల రేటు 0.04 గా ఉందన్నారు. దీనిలో డ్రైవర్ల కృషి ఎంతో ఉందన్నారు. వారితో సంస్థ ప్రగతి సాధిస్తోందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. అనంతరం అత్యధిక ప్రమాద రహిత సర్వీస్‌ను కలిగిన ఎస్‌కే ఎండీ రజాక్(విజయవాడ డిపో), కేవీ రావు(గవర్నర్‌పేట–2)లతో పాటు 24మంది ఉత్తమ డ్రైవర్, మెకానిక్‌లను సత్కరించి బహమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డెప్యూటీ సీటీఎం టి.సాయిచరణ్, పీఎన్‌బీఎస్ డెప్యూటీ సీటీఎం సీహెచ్ పవన్‌కుమార్, డిపో మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


