అన్ని పంచాయతీల్లో ‘సోలార్’
పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అన్ని గ్రామ పంచాయతీల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేసి గ్రీన్ పంచాయతీలుగా మారుస్తామని కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. స్థానిక తంబరేణి గార్డెన్స్‌లో శుక్రవారం సంపూర్ణత అభియాన్ 2.0 ప్రారంభించారు. ముందుగా ఐసీడీఎస్, పశుసంవర్ధక శాఖ, విద్యాశాఖ, సమగ్ర సహిత విద్యా విధానం వారు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2023లో ప్రధాని నరేంద్ర మోదీ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం ప్రారంభించారని దీనిలో భాగంగా దేశంలో 500 వెనుక బడిన మండలాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 15, ఎన్టీఆర్ జిల్లాలో పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాలను గుర్తించారన్నారు. వీటిల్లో సంపూర్ణ అభియాన్ 1.0 లో గుర్తించిన సూచికల్లో వృద్ధిని సాధించామన్నారు. పంచాయతీల్లో సోలార్ పవర్ ఏర్పాటు చేసి గ్రీన్ ఎనర్జీని పొందడమే కాకుండా ఆదాయం పొందవచ్చన్నారు. స్మార్ట్ అగ్రికల్చర్‌పై దృష్టి పెట్టాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వసతులు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నీతి ఆయోగ్ సూచించిన అన్ని సూచికల్లో సంతృప్తి సాధించాలన్నారు. పెనుగంచిప్రోలులో శ్మశాన వాటిక చాలా అవసరం ఉందని జెడ్పీటీసీ వూట్ల నాగమణి ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వారు సానుకూలంగా స్పందించారు. సంపూర్ణత అభియాన్ పోస్టర్ ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, ఎంపీపీ మార్కపూడి గాంధీ,డీఈఓ ఎల్ చంద్రకళ, పశుసంవర్ధకశాఖ జేడీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
బాపూజీకి నివాళి
తొలుత బాపూజీ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


