వివాదాలమయం.. ప్రగతి సుదూరం
2023 డిసెంబర్ 7న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసిన పనులివే..
రూ. 30కోట్లతో అన్నప్రసాద భవనం
రూ. 13కోట్లతో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్
రూ. 15కోట్ల వ్యయంతో ఆలయం దక్షిణం వైపున క్యూ కాంప్లెక్స్
రూ.7.75కోట్లతో కనకదుర్గనగర్‌లో మహారాజ ద్వార నిర్మాణం
రూ. 18.30కోట్లు మల్లికార్జున మహా మండపం పునరుద్దరణ పనులు
రూ.19కోట్ల కేశఖండనశాల నిర్మాణం
రూ.10కోట్లు గోశాల కాంప్లెక్స్
నత్తనడకన దుర్గగుడి అభివృద్ధి పనులు
వరుస వివాదాలతో అపఖ్యాతి..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దుర్గగుడిలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ప్రారంభించిన పలు అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దుర్గగుడి చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిధుల నుంచి రూ. 70 కోట్లను ఆలయ అభివృద్ధికి కేటాయించారు. 2023 డిసెంబర్ 7న దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రూ.216.05 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. రూ.23.14 కోట్లతో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇక దశాబ్దాల తరబడి నిర్మాణానికి నోచుకొని మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని సైతం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పునఃనిర్మించింది. 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొండపై కూల్చివేసిన ప్రసాదాల పోటు స్థానంలో పూజా మండపాలు, మహా మండపం ఎదుట అన్నదాన భవనం, గోశాల పక్కనే లడ్డూ ప్రసాదాల పోటు నిర్మాణానికి పూనుకుంది.
నాన్చుడు ధోరణి..
ఎన్నికల నాటికి ఓ దశకు చేరుకున్న పనులను పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఏడాదిన్నర దాటినా సరిపోలేదు. పనులు పూర్తి చేయడంలో నాన్చుడు ధోరణిలో వ్యవహారిస్తోంది. ఈ ఏడాది దసరా నాటికి అన్నదాన భవనం, లడ్డూ ప్రసాదాల పోటును సిద్ధం చేసేలా దేవస్థానం కార్యాచరణ సిద్ధం చేసినట్లు ప్రకటిస్తోంది. మరో వైపున 2028 కృష్ణా పుష్కరాల సమయానికి దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులన్నీ పూర్తవుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
బహుళ ప్రయోజనాలు..
అమ్మవారి ఆలయం ఎదుట రూ. 26కోట్ల అంచనాలతో నూతన అన్నదాన భవన నిర్మాణం జరుగుతోంది. ఈ నూతన అన్నదాన భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో స్టోర్స్, అన్న ప్రసాద తయారీకి వంటశాల, ఇతర గదులను నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తులో భక్తులు కూర్చొని భోజనాలు చేసేలా పెద్ద హాల్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే నూతన అన్నదాన భవనం పూర్తయితే మహా మండపంలో ప్రస్తుతం ఉన్న అన్న ప్రసాద వితరణ, భక్తుల క్యూలైన్‌లను ఇక్కడికి తరలిస్తారు. దీంతో మహా మండపంలోని రెండు, మూడు అంతస్తులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు అంతస్తులలో భక్తులు వేచి ఉండేందుకు హాళ్ల నిర్మాణం చేస్తే బహుళ ప్రయోజనకరంగా ఉండే అవకాశాలున్నాయి. అమ్మవారి సన్నిధిలో ఏడాదిలో ఒకటి, రెండు నెలలు మినహా ప్రతి నెలా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల రద్దీతో అటు మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్‌రోడ్డులో రద్దీ నెలకొంటుంది. ఆ రద్దీని నియంత్రించేందుకు మహా మండపంలోని రెండు, మూడు అంతస్తులో హాళ్లను ఏర్పాటు చేయడంతో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయనే అభిప్రాయాలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
అధికంగా భక్తులు..
ఇటీవల దుర్గగుడి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణ రోజుల్లో 40వేల నుంచి 50వేలు, శుక్ర, శని, ఆదివారాల్లో 60వేల నుంచి70వేలు.. పండుగలు, పర్వదినాల్లో 70వేల నుంచి 80వేల మంది అమ్మవారిని దర్శించుకొంటున్నారు. అమ్మవారికి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 15రోజులకు రూ.కోటి నుంచి రూ.1.25కోట్ల ఆదాయం వచ్చేది. తాజాగా సోమవారం జరిగిన హుండీ కానుకల లెక్కింపులో 16 రోజులకు రూ.2.60 కోట్ల ఆదాయం వచ్చింది. ఆదాయం భారీగా పెరిగినా భక్తులకు వసతులు కల్పించడంలో దేవదాయశాఖ అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు. భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపించినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతూనే ఉన్నారు.
వీటిల్లో కొత్త ప్రభుత్వం చాలా పనులు ప్రారంభించలేదు. కొన్ని పనులు నత్తనడకన సాగుతున్నాయి. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, చేర్పులు అంటూ కాలం వెల్లదీస్తోంది. పనులపై ప్రతి సోమవారం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సమీక్ష నిర్వహిస్తున్నా ప్రయోజనం శూన్యమనే చెప్పాలి.
దుర్గగుడిలో గత కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పలు వివాదాలు ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దేవస్థానానికి సరఫరా అయ్యే విద్యుత్‌ను నిలిపివేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సమస్య ఒక కొలిక్కి వస్తుందనుకునే తరుణంలో అమ్మవారి శ్రీచక్రనవార్చన పూజ అరగంట పాటు నిలిచిపోవడం మరో వివాదం నెలకొంది. అమ్మవారి అభిషేకానికి వినియోగించే పాలలో పురుగు రావడం, దేవస్థానంలో ఉండాల్సిన గోశాలను దేవదాయ శాఖ అనుమతులు లేకుండా పోరంకికి తరలించడం వంటి వరుస వివాదాలు చోటు చేసుకోవడంతో ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారాలపై వైఎస్సార్ సీపీ నేతలు దేవస్థాన అధికారులను, ట్రస్ట్ బోర్డు సభ్యులను ప్రశ్నించడంతో సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు. పోరంకి నుంచి హుటాహుటిన రెండు గోవులను దేవస్థాన ప్రాంగణంలోని గోశాలకు తరలించి తమ తప్పును సరి చేసుకున్నారు. దీనిపైన విచారణ జరుపుతున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు కలరింగ్ ఇస్తూ, అందుకు బాధ్యులైన కొంత మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి సరిపెట్టారు.
వివాదాలమయం.. ప్రగతి సుదూరం
వివాదాలమయం.. ప్రగతి సుదూరం


