సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. పల్నాడులో సాల్మన్ హత్య ప్రభుత్వ హత్యేనని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం గిరిపురం శిఖామణి సెంటర్‌లో సాల్మన్ హత్యను ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఆటవిక పాలన..
కార్యక్రమంలో పాల్గొన్న కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులపై దాడులు, హత్యాకాండ కొనసాగుతోందన్నారు. దళితులను హత్య చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని, కక్షసాధింపు చర్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు. అందులో భాగంగానే సాల్మన్ హత్య జరిగిందన్నారు. గతంలో మాల, మాదిగల మధ్య వైషమ్యాలు సృష్టించారని, దానికి నిరూపణగానే ఈ రోజు హత్యలు జరుగుతున్నాయన్నారు. నేడు దళితులు కుటుంబాలకు కుటుంబాలే గ్రామాలు వదిలి వెళ్లిపోతున్నారని, సాక్షాత్తూ డెప్యూటీ సీఎం నియోజకవర్గంలోనే మాలలను గ్రామ బహిష్కరణ చేశారన్నారు. ఇది కులంహకారంతో జరుగుతున్న పాలన అన్నారు. సాల్మన్ హత్యకు చంద్రబాబు, హోం మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్‌లు కుక్కల అనిత, మెరకనపల్లి మాధురి, పార్టీ నేతలు ఒగ్గు గవాస్కర్, కొమ్ము చంటి, చంద్రలీల, బూదాల శ్రీనివాసరావు, బోడా ప్రేమ్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


