ముగిసిన కొండపల్లి బొమ్మల తయారీపై శిక్షణ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): హస్తకళల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ, అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్ వారు కొండపల్లి బొమ్మల కళాకారులకు రెండు నెలలుగా నిర్వహించిన డిజైన్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ వర్కు షాప్స్ శిక్షణ సోమవారంతో ముగిసింది. ముగింపు సభకు కేంద్రం జౌళీ మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ ప్రతినిధి రవీంద్ర గౌతమ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హస్తకళల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ ఇండియా–దక్షిణాది రాష్ట్రాల సంచాలకులు కలవకొలను నాగ తులసీరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతూ కొండపల్లిలో తయారయ్యే బొమ్మలు విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేయాలని కోరారు. జౌళీ మంత్రిత్వ శాఖ డీసీ(హెచ్)హెచ్ పీఓ మాట్లాడుతూ బొమ్మల శిక్షణ ద్వారా వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన కళాకారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ అసిస్టెంట్ డైరెక్టర్ చినిమిల్లి దివాకర్, డిజైనర్ ప్రాసంజిత్ మహంతి పాల్గొన్నారు.
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.60 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ. 2.60కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు గాను రూ.2,60,86,479 నగదు, 135 గ్రాముల బంగారం, 2.858 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. రోజుకు సుమారుగా రూ.16లక్షల మేర హుండీల ద్వారా ఆదాయం లభించిందన్నారు. ఇక విదేశాలకు సంబంధించి యూఎస్‌ఏకు చెందిన 804 డాలర్లు, యూరప్‌కు చెందిన 235 యూరో లు, యుఏఈకి చెందిన 185 దిర్హమ్స్, నైజీ రియాకు చెందిన 1500 నైరాలు, కెనడా డాలర్లు వంద, సౌదీ అరేబియా రియాల్స్ 30, ఇంగ్లాండ్‌కు చెందిన 25 పౌండ్లు లభించినట్లు అధికారు లు పేర్కొన్నారు. కానుకల లెక్కింపును ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ పర్యవేక్షించారు.
‘సఖీ’ వాహనం ప్రారంభం
చిలకలపూడి(మచిలీపట్నం): సఖీ వన్‌స్టాప్ సెంటర్‌కు కేటాయించిన ప్రత్యేక వాహనాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం కలెక్టరేట్‌లో జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు, బాలికలు ఎదుర్కొనే హింస, వేధింపులు, వివక్ష వంటి సమస్యలకు తక్షణ సేవలు అందించడంలో సఖి వన్ స్టాప్ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ వాహనం ద్వారా బాధితులకు తక్షణ చేరువ, కౌన్సెలింగ్, వైద్య, పోలీస్, న్యాయ సహాయం వంటి సేవలను వేగవంతంగా అందించవచ్చన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, సఖి వన్ స్టాప్ సెంటర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ పి అర్చిష్మ, డీసీపీవో కిషోర్, చైల్డ్ లైన్ డిస్టిక్ కోఆర్డినేటర్ నాగరాజు, వన్ స్టాప్ సెంటర్, చైల్డ్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.
వేమన పద్యాలు సామాజిక చైతన్య దీపికలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగి వేమన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని.. ఆయన పద్యాలు సామాజిక చైతన్యానికి ప్రతీకలు అని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. సోమవారం యోగి వేమన జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. జేసీ ఇలక్కియ అధికారులతో కలిసి యోగి వేమన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక చైతన్యంతో కూడిన వేమన పద్యాల సాహిత్య ఔన్నత్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. జేసీ ఇలక్కియ మాట్లాడుతూ సమాజంలోని వివిధ సమస్యలను భిన్న కోణాల్లో స్పృశించి.. వేమన తన పద్యాల్లో విలువలను చొప్పించారని పేర్కొన్నారు. డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన కొండపల్లి బొమ్మల తయారీపై శిక్షణ
ముగిసిన కొండపల్లి బొమ్మల తయారీపై శిక్షణ


