● జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ● జిల్లా స్థాయి పీజీఆర్
ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిబద్ధతతో, నాణ్యతతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. అర్జీదారుల సంతృప్తే అధికారుల పనితీరుకు గీటురాయని జేసీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్, ఏవీఎస్ రెడ్డి హాల్ నందు నాన్ రెవెన్యూ పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. జేసీ ఇలక్కియ డీఆర్వో లక్ష్మీ నరసింహంతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలపై ప్రత్యేక దృష్టిపెట్టి క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో జాప్యానికి తావులేకుండా పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలించి, అధికారుల సహకారంతో నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.
మొత్తం 133 అర్జీలు..
పీజీఆర్‌ఎస్ రెవెన్యూ క్లినిక్‌లో 62 అర్జీలు, 71 రెవెన్యూ యేతర అర్జీలు కలిపి మొత్తం 133 అర్జీలు వచ్చాయని జేసీ చెప్పారు. రెవెన్యూ యేతర అర్జీల్లో పురపాలక శాఖకు 18, పంచాయతీరాజ్ శాఖకు 16, పోలీసు శాఖకు 16, డీఆర్‌డీఏకు 4, పౌర సరఫరాల శాఖకు మూడు అర్జీలు వచ్చాయి. విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రహదారులు–భవనాల శాఖలకు రెండు చొప్పున అర్జీలు రాగా డ్వామా, ఇరిగేషన్, విభిన్న ప్రతిభావంతులు, లేబర్, ఖజానా, పర్యాటకం, రవాణా శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయన్నారు. నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి తదితరులు పాల్గొన్నారు.


