వ్యక్తిగత పరిశుభ్రతతో ఆరోగ్యం
ముస్తాబు కార్యక్రమ ప్రారంభంలో మంత్రి సవిత
మోపిదేవి: విద్యార్థులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత సూచించారు. మండల కేంద్రం మోపిదేవి ఏపీఎంజేపీబీసీ గురుకుల బాలుర పాఠశాల, స్థానిక ఆశ్రమ పాఠశాలల్లో సోమవారం ముస్తాబు కార్యక్రమాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆశ్రమ పాఠశాలను గతంలో మంత్రి సందర్శించినప్పుడు పాఠశాలలో పల్లం ప్రాంతాన్ని మెరక చేయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని జనసేన నాయకుడు కోసూరు రామాంజనేయులు గత చిత్రపటాలను(ఫొటో) మంత్రికి చూపించి తక్షణం ఆ హామీని అమలు చేయాలని కోరారు. బాలురకు గురుకుల పాఠశాల ఉన్నట్లే దివిసీమకు మరో బాలికల గురుకుల పాఠశాల మంజూరు చేయాలని, స్కావెంజర్స్‌కు గౌరవ వేతనం పెంచాలంటూ కోలా బాలాజీ మంత్రికి వినతిపత్రం సమర్పించారు. తొలుత ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అద్దము, దువ్వెన, వాష్ బేసిన్ మంత్రి పరిశీలించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కోరిన విధంగా అదనపు తరగతి గదులకు త్వరలో నిధులు విడుదలవుతాయని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి పి.మాధవీలత, రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరావు, ఎంపీపీ రావి దుర్గావాణి, మార్కెట్ యార్డు చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


